JL Recruitment | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): జూనియర్ లెక్చరర్(జేఎల్) పోస్టుల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎడతెగని తాత్సారం చేస్తున్నది. కొన్ని సబ్జెక్టులకు ఫలితాలు విడుదలైనా, మరికొన్నింటి సబ్జెక్టుల ఫలితాలు విడుదల చేయలేదు. దీంతో 1:1 జాబితాలు విడుదలకాలేదు. కొన్ని సబ్జెక్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైనా నియామకాలు ఇంకా కొలిక్కిరాకపోవడంతో ఎంపికైన వారికి నియామకపత్రాలివ్వడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. అయితే కొన్ని సబ్జెక్టుల్లో 1:1 జాబితా విడుదలై, ఎంపికైన 500 మందికి ప్రజా విజయోత్సవాల్లో నియామకపత్రాలివ్వాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు. తమకు త్వరగా నియామకపత్రాలివ్వాలంటూ మంత్రులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన అభ్యర్థులు ప్రజావాణికి హాజరై, తమకు న్యాయం చేయాలని వినతిపత్రాలు సమర్పించారు.
రాష్ట్రంలో 14 ఏండ్ల తర్వాత జేఎల్ నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో 2008లో జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీచేశారు. మళ్లీ 2022లో నోటిఫికేషన్ జారీ అయ్యింది. గత కేసీఆర్ సర్కారు చొరవతోనే ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ విద్య చరిత్రలో ఒకేసారి 1,392 పోస్టుల భర్తీకి టీజీపీస్సీ 2022లో నోటిఫికేషన్ జారీచేసింది. టీజీపీఎస్సీ ఇప్పటి వరకు 16 సబ్జెక్టులకు ఫలితాలు విడుదల చేసింది, మరో 7 సబ్జెక్టుల ఫలితాలు విడుదల చేయలేదు. 800 పోస్టుల ఫలితాల కోసం దాదాపు 2400 మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. తమకు త్వరగా 1:1 జాబితా విడుదల చేయడంతోపాటు నియామక పత్రాలు కూడా అందజేయాలని వీరు కోరుతున్నారు.
ఇంటర్ విద్యలో అధ్యాపకుల లేమి పట్టిపీడిస్తున్నది. జేఎల్ 5,395 పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 1,724 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వొకేషనల్ జేఎల్ పోస్టులు 624 ఉండగా, ప్రస్తుతం 334 ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు సైతం కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్తో భర్తీ అయినవే. జనరల్, వొకేషనల్ కలిపి మొత్తంగా 2వేలకు పైగా జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.