సిరిసిల్ల రూరల్, జూన్ 1: సిరిసిల్లలో నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది. ఆరు నెలల క్రితం వరకు వస్త్ర పరిశ్రమలో చేతినిండా పనితో సంతోషంగా బతికినా.. ఇప్పుడు కుటుంబ పోషణకే కష్టపడాల్సి వస్తున్నది. నేత పనిని వదిలేసి కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ కష్టసమయంలోనే అనారోగ్య సమస్యలు వెంటాడి మరింత కుంగిపోవాల్సి వస్తున్నది.
అందుకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వపూర్కు చెందిన నేత కార్మికుడు మేర్గు శ్రీనివాస్ దీనగాథే నిదర్శనం. నాలుగేండ్ల క్రితం ఉపాధి కోసం భార్య మంజుల, కొడుకులు అభిషేక్, అనూష-అశోక్ (కవలలు), కార్తికేయ (5)తో వేములవాడకు వలస వచ్చాడు. అక్కడే ఉంటూ నేత కార్మికుడిగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలం తర్వాత తంగళ్లపల్లికి వచ్చి ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఆరు నెలల క్రితం వరకు మరమగ్గాల కార్మికుడిగా పనిచేశాడు. కేసీఆర్ సర్కారు ఉన్నంత కాలం చేతినిండా పనితో సంతోషంగా బతికిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆగమయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆర్డర్లు లేక, మరమగ్గాలు నడువక చేతినిండా పని దొరకక కుటుంబ పోషణకు కష్టపడుతున్నాడు. భార్య మంజుల బీడీలు చుడుతుండగా.. దొరికిన రోజు కూలి పనులకు వెళ్తూ కాలం వెల్లదీస్తున్నాడు. ఇదే సమయంలో ఆయనకు మరో కష్టం వచ్చిపడింది.
కొడుకు కార్తికేయకు మరోసారి గుండె సమస్య రావడంతో తల్లడిల్లిపోతున్నాడు. నాలుగేండ్ల క్రితం ఏడాది వయసున్న కొడుకు గుండెకు రంధ్రం ఉండటంతో రూ.2 లక్షల దాకా ఖర్చు చేసి ఆపరేషన్ చేయించాడు. ఇక కార్తికేయకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అనుకుంటున్న తరుణంలోనే మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. కిమ్స్ దవాఖానాలో చూపించగా.. బాబుకు మళ్లీ గుండె సమస్య వచ్చిందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.
అందుకు సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో శ్రీనివాస్ ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నాడు. ఐదు నెలలుగా మందులు వాడుతూ కొడుకును కాపాడుకుంటున్నామని, మందులకు సైతం డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు స్పందించి తమ కొడుకు ఆపరేషన్‌కు సాయం అందించాలని కోరుతున్నాడు. ప్రభుత్వం కూడా స్పందించి తన కొడుకు కార్తికేయకు ఆపరేషన్ చేయించాలని వేడుకుంటున్నాడు.
దాతలు ఇలా సంప్రదించాలి
అకౌంట్ నంబర్: 100320021126886 (గాయత్రీ బ్యాంక్, వేములవాడ)
ఐఎఫ్ఎస్సీ కోడ్: HDFCOCTGCUB
బ్రాంచ్ : ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్
ఫోన్‌పే నంబర్: 8978396342