Sushee Infra : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా కంపెనీకి సీబీఐ షాకిచ్చింది. కాంట్రాక్టు పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇస్తూ సుశీ ఇన్ఫ్రా కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ఈ సుశీ ఇన్ఫ్రా లంచాల బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో సుశీ ఇన్ఫ్రా నేరపూరిత కుట్రకు పాల్పడిందంటూ ఢిల్లీ సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సీబీఐ నమోదు చేసిన ఆ ఎఫ్ఐఆర్లో మంత్రి కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా కంపెనీ A-15 గా ఉన్నది. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్కు భారీగా లంచాలు ఇచ్చినట్టు సీబీఐ విచారణలో బయటపడింది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలోని పనుల కోసం అధికారులకు సుశీ ఇన్ఫ్రా లంచాలు ఇచ్చినట్లు గుర్తించింది.
సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్ అకౌంట్లలో దాదాపు రూ.1 కోటి వరకు సుశీ ఇన్ఫ్రా లంచాలు జమచేసినట్లు తేలింది. దీన్ని సీబీఐ ఆధారాలతో సహా బయటపెట్టింది. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని విడుదల చేసింది.