బొడ్రాయిబజార్, మే 18 : సూర్యాపేటలో చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయడం అద్భుతమని ఏపీలోని వైఎస్సార్ (కడప) జిల్లా పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి కితాబిచ్చారు. సూర్యాపేట పట్టణంలో చెత్తతో సేంద్రియ ఎరువు, సింగిల్ యూజ్ వేస్ట్ ప్లాస్టిక్‌తో ఇటుకలు, టైల్స్, ఆక్యుప్రెజర్ మ్యాట్ తయారీని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ పీ రామానుజులరెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ రాష్ర్టాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారని, అందుకు తెలంగాణలోని సూర్యాపేట మున్సిపాలిటీ ఆదర్శం కానున్నదని ఆయన పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా అంతమొందించేందుకు నిర్ణయించుకోగా సూర్యాపేట మున్సిపాలిటీ ప్లాస్టిక్ రీ సైక్లింగ్ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకే తాను సూర్యాపేటకు వచ్చి చెత్త నుంచి సేంద్రియ ఎరువులు, వేస్ట్ ప్లాస్టిక్ నుంచి వస్తువులు తయారు చేయడం చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఇక్కడి విధానాలు పూర్తిగా పరిశీలించానని, తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.