బెంగళూరు, నమస్తే తెలంగాణ ప్రతినిధి: హోటళ్లు, రెస్టారెంట్లలో మెనూకార్డుల మాదిరిగా కర్ణాటకలో వివిధ కార్యాలయాలు, కూడళ్ల వద్ద బీజేపీ సర్కారు అవినీతిపై ఇలాం టి బోర్డులు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. కర్ణాటకలో బసవరాజు బొమ్మై నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివిధ పనులకు వసూలు చేస్తున్న లంచాల వివరాలను ఇందులో పొందుపరిచారు. బీజేపీ అవినీతిని ఎండగడుతూ ఇలాంటి బోర్డులు కనిపిస్తున్నాయి. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మూడేండ్లలో రూ.లక్ష యాభై వేల కోట్ల లంచాలను ప్రజల నుంచి వసూలు చేసిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. బీజేపీ ప్రభుత్వ అవినీతికి ప్రజలు విసిగిపోయిన నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ‘కర్ణాటకలో అవినీతికి అంతులేకుండా పోయిం ది.
ప్రజల రక్తం తాగుతున్నారు. గుత్తేదారు, పాలకపక్ష కార్యకర్త సంతోష్ గ్రామీణాభివృద్ధిశాఖకు 40% లంచం ఇచ్చుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటి మంత్రి ఈశ్వరప్పపై కేసే లేదు. అరెస్టు చేయలేదు’ అని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల బెంగళూరును ముంచెత్తిన జలప్రళయం విషయం లో కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పుబట్టిన బీజేపీ అనుకూల వ్యాపారవేత్తకు చెందిన వ్యాపార సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని వివరించారు. ఒకో ఎమ్మెల్యేను రూ.50-100 కోట్లతో కొన్నారని, ఆ ఖర్చును రాబట్టుకొనేందుకు లంచాలు వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బాధితులు ఫోన్‌చేయండి
అవినీతి వల్ల ఇబ్బందులకు గురైనవారు 8447704040 నంబరుకు ఫోన్ లేదా వాట్సాప్ మెస్సేజ్ చేయాలని సూచిస్తున్నాయి. అధిష్ఠానానికి రూ.2,500 కోట్లు ఇవ్వలేకపోయినందునే తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదని బహిరంగంగా చెప్పిన మాజీ మంత్రి బసవరాజు పాటిల్‌పై బీజేపీ ఇప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదని గుర్తుచేస్తున్నారు. సిలికాన్ సిటీ, గార్డెన్ సిటీ, సైన్స్ సిటీగా పేరొందిన బెంగళూరు.. అవినీతిలో దేశానికి రాజధానిగా మారిందనే విమర్శలొస్తున్నాయి.