ఖమ్మం కమాన్‌బజార్, ఏప్రిల్ 13 : దేశంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్డీఏ కూటమిని గద్దెదించడమే లక్ష్యంగా ప్రధాన ఎజెండాతో పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎం, ఇండియా కూటమి ముందుకెళ్తున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని ప్రమాదకరస్థాయికి తీసుకెళ్లిందని, ఎన్డీఏ కూటమి మళ్లీ ఆధికారంలోకి వస్తే దేశ రాజ్య స్వభావమే పూర్తిగా మారిపోతుందని అన్నారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీకి ఎన్నికల్లో గెలుస్తామనే విశ్వాసం ఉంటే ప్రతిపక్ష పార్టీల ప్రముఖులు, సీఎంలు కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లాంటి వారిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశంలో బీజేపీకి ప్రమాదకరంగా ఉన్నారంటే ఈడీ, సీబీఐ చేత దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ప్రజలు తమకు ఓట్లు వేయరనే భయంతోనే ఎన్నికల ముందు ఈ అరెస్టులు చేయిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకూడదనే లక్ష్యంతో తమ పార్టీ ముందుకెళ్తుందని అన్నారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.