హైదరాబాద్, ఆగస్టు22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్మాణం చేపట్టిన ఆదిలాబాద్ ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్‌కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌లో ఈ టవర్ అందుబాటులోకి రావడం ద్వారా ప్రాంతీయంగా సాంకేతిక రంగానికి కొత్త ఊపిరి అందనున్నది. ఈ పరిణామంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఐటీ టవర్ ద్వారా ఆదిలాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన యువతీయువకులకు స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ హయాంలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ వంటి నగరాల్లో విజయవంతంగా ఐటీ టవర్లను ప్రారంభించి కంపెనీలను ఆకర్షించామని ఆయన గుర్తుచేశారు.
అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ టవర్ల నిర్వహణను పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. మౌలిక సదుపాయాల కల్పనలో లోపాల వల్ల పలు టవర్లలో ఐటీ పరిశ్రమ విస్తరణ మందగిస్తున్నదనే వార్తలు వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదిలాబాద్‌తో పాటు అన్ని ద్వితీయ శ్రేణి నగరాల్లోని ఐటీ టవర్లకు అవసరమైన అన్ని సదుపాయాలను పునరుద్ధరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రముఖ ఐటీ కంపెనీలను ఆకర్షించేలా ప్రత్యేక చర్యలు తీసుకొని, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దకేలా చూడాలని కోరారు.