Detention | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యలో నాన్ డిటెన్షన్ విధానం రద్దు లాభమా..? నష్టమా..? అన్న చర్చ లు సాగుతున్నాయి. కొందరు ఈ విధానాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం రాష్ట్రంలో అమలవుతుం దా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. నాన్ డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేసి, డిటెన్షన్ విధానాన్ని 2018లోనే కేంద్రం తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించింది. తాజాగా కేంద్రం విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. గెజిట్ను సైతం జారీచేసింది. విద్యాశాఖ మంత్రి గా సీఎం రేవంత్రెడ్డియే కొనసాగుతున్నారు. ఇప్పటికే కేంద్రం తీసుకొచ్చిన అనేక సంస్కరణలను అమలుచేస్తున్నారు. మరీ ఈ నిర్ణయా న్ని అమలుచేస్తారా.. లేదా? అన్నది సందేహంగా మారింది.
ఈ విధానాన్ని ప్రస్తుతం సైనిక్స్కూళ్లు, కేవీలు, జవహార్ నవోదయ వంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అమలుచేస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత రాష్ర్టాల్లోనూ ఈ విధానాన్ని అమలుచేసే యోచనలో కేంద్రముంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నాయి. ఈ విధానంతో లాభం జరుగుతుందని, విద్యార్థులను గాడినపెట్టే అవకాశముంటుందని తపస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి నవాత్ సురేశ్ అభిప్రాయపడ్డారు.
పాఠశాలలో అభ్యసన సంక్షోభంలో ఉందని, ఈ సంక్షోభం నుంచి డిటెన్షన్ విముక్తి కల్పిస్తుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(నేపా) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పారిపల్లి శంకర్ అభిప్రాయపడ్డారు. ఫెయిల్ అయితే మళ్లీ పరీక్షల కు సన్నద్ధం చేయవచ్చని, అంతిమంగా విద్యార్థికే లాభం జరుగుతుందని పేర్కొన్నారు. నో డిటెన్షన్ విధానం రద్దుతో డ్రాపౌట్స్ పెరుగుతాయని టీఎస్ యూటీఎఫ్ ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తిరస్కరించాలని రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు.