హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద రాష్ర్టానికి నిధులు విడుదల చేయలేదని, అందుకే తాము బస్తీ దవాఖానల్లోని సిబ్బందికి జీతాలు ఇవ్వలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. మూడు నెలలుగా వేతనాలు అందక బస్తీ దవాఖానల సిబ్బంది పడుతున్న అవస్థలపై గురువారం ‘బస్తీ దవాఖానల్లో జీతాలు బంద్’ శీర్షిక పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వార్తపై వైద్యారోగ్య శాఖ స్పందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు కేంద్రం నుంచి ఆయుష్మాన్ భారత్ నిధులు రాలేదని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణణ్ శుక్రవారం తెలిపారు. నిధులు విడుదలైన వెంటనే వేతనాలు చెల్లిస్తామని పేర్కొన్నారు.