హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో ఆఫీసర్ పోస్టుల ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో ఏండ్లుగా ఇన్చార్జుల పాలనే కొనసాగుతున్నది. దీర్ఘకాలంగా డిప్యుటేషన్లపై పనిచేస్తున్న దిగువస్థాయి అధికారులదే ఆడింది ఆట.. పాడింది పాటగా కొనసాగుతున్నది. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటూ, నిబంధనల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సొసైటీని భ్రష్టు పట్టిస్తున్నారని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి. గురుకుల సొసైటీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనే కీలక పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. అడిషనల్ సెక్రటరీ-1, జాయింట్ సెక్రటరీ-1, డిప్యూటీ సెక్రటరీ-3, ఫైనాన్స్ సెక్రటరీ-1, 150 ప్రిన్సిపాల్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రస్తుతం జేఎస్ పోస్టులన్నింటినీ సీనియారిటీతో సంబంధం లేకుండా, సొసైటీ సిబ్బందితోనే, అదీ డిప్యూటేషన్‌పై ప్రధాన కార్యాలయంలో ఏండ్లకు ఏండ్లుగా అక్రమమార్గంలో తిష్ట వేసిన వారితోనే భర్తీ చేయడం గమనార్హం. ప్రిన్సిపాల్‌గా మూడేండ్లు అనుభవం కలిగిన వారినే జాయింట్ సెక్రటరీగా నియమించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలకు సైతం పాతరేసి, సీనియర్లను పక్కనపెట్టి ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘకాలంపాటు పాగావేసిన ఒకరిని జాయింట్ సెక్రటరీగా నియమించడం కొసమెరుపు. అదేవిధంగా మరొక జేఎస్, డీఎస్ పోస్టును సైతం ఇలాగే భర్తీ చేశారు. జోనల్ ఆఫీసర్ పోస్టులను సైతం ఇన్చార్జులతో నెట్టుకొస్తున్నారు. ప్రమోషన్లు పొందకుండా నష్టపోయిన పలువురు ప్రిన్సిపాళ్లు ఆర్టీఐ ద్వారా ఆ నిజాలను వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీలు వరుసగా మారడం.. ఒక్కరు కూడా సుదీర్ఘకాలం కొనసాగకపోవడం గమనార్హం. దీంతో సొసైటీలో ఇన్చార్జుల హవానే కొనసాగుతున్నది.
సొసైటీలో డిప్యుటేషన్లపై కొనసాగుతూ, కీలకస్థానాలు ఆక్రమించిన అధికారులే ఇప్పుడు ఏండ్లుగా ప్రమోషన్ల ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. సర్కార్‌ను, ఆఖరికి అమాత్యుడిని సైతం పక్కదోవపట్టిస్తున్నారని వివరిస్తున్నాయి. వాస్తవంగా రెగ్యులర్ ప్రమోషన్లు కల్పిస్తే ఫైల్లో స్టాండింగ్ ఆర్డర్స్ రాయాల్సి ఉంటుంది. అప్పుడు తమ హయాంలో జరిగిన తప్పులు బయటికి వస్తాయని, దీంతో ప్రమోషన్ల ఫైలు ముందుకు పోకుండా అడ్డుకుంటున్నారని సంఘాలు వివరిస్తున్నాయి. ప్రమోషన్లు కల్పిస్తే తమ సీట్లకు ఎసరొస్తుందని ఐదేండ్లుగా ప్రమోషన్లకు కొర్రీలు పెడుతున్నారని పేర్కొంటున్నాయి. ఇంత జరుగుతున్నా, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కనీసం సర్కార్ పట్టించుకోవడం లేదని వాపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని సొసైటీ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.