TGSRTC | రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీగా వరదలను ముంచెత్తడంతో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య రవాణాకు కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల భారీగా వరద ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో వెళ్లే బస్సులను రద్దు చేసింది.
హైదరాబాద్ – విజయవాడ మధ్య 560కి పైగా బస్సులను రద్దు చేస్తూ టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ జిల్లాలో 150, రంగారెడ్డి జిల్లాలో 70కిపైగా బస్సులను టీజీఎస్ఆర్టీసీ రద్దు చేసింది.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 86 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వీటితో పాటు 70కి పైగా రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. రద్దయిన రైళ్లలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయని ఎస్సీఆర్ వెల్లడించింది. పలు ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దుచేసినట్లు తెలిపింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దుచేశామని అధికారులు పేర్కొన్నారు. కాజీపేట-డోర్నకల్-కాజీపేట, డోర్నకల్-విజయవాడ-డోర్నకల్, విజయవాడ-గుంటూరు-విజయవాడ రైళ్లను రద్దు చేయగా, ఢిల్లీ-సెంట్రల్ చెన్నై, దానాపూర్-బెంగళూరు రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా రాయపురం-పటేల్ నగర్, హజ్రత్ నిజాముద్దీన్-రేణిగుంట రైళ్లను మరోమార్గంలో మళ్లించారు.