హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో పారదర్శకత లోపించిందని, రీవాల్యూయేషన్ చేయాలని, లేదంటే రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. తీర్పులోని
అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు టీజీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం సుమారు ఐదు గంటలపాటు దీనిపై చర్చించారు.
ఇందులో సభ్యులు, కమిషన్ అధికారులు, న్యాయనిపుణులు సైతం పాల్గొన్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అనుసరించి పునర్మూల్యాంకనం చేస్తే అనేక న్యాయపరమైన చిక్కులు తప్పవని పలువురు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిసింది. అయితే అప్పీల్‌కు వెళ్లాలా వద్దా? వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి.? తుదితీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలా? అనే అంశాలపై సమాలోచనలు చేసినట్టు తెలిసింది. ఒకవేళ పునర్మూల్యాంకనం జరిపితే.. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య పెరిగినా.. తగ్గినా న్యాయపరంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, సమస్య మరింత జఠిలమవుతుందని భావించి డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినందున ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు నష్టపోతారనే విషయాన్ని డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది.
కోఠి మహిళా కాలేజీలో పురుషులకు సరైన వసతులు లేవని.. మహిళలకే కేటాయించాలన్న కాలేజీ నిర్వాహకుల విజ్ఞప్తిమేరకే నిర్ణయం తీసుకున్న విషయాన్ని సింగిల్ బెంచ్ పట్టించుకోలేదని, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కాలేదనే అంశాన్ని డివిజన్ బెంచ్ ముందుకు తీసుకెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తున్నది. టీజీపీఎస్సీ తరఫు లాయర్లు చేసిన వాదనలు, చూపిన ఆధారాలను సింగిల్ బెంచ్ పట్టించుకోలేదనే అంశాలను సవివరంగా ప్రస్తావించాలని భావిస్తున్నారు. ఒకవేళ డివిజన్ బెంచ్‌లోనూ చుక్కెదురైతే పరీక్షను రద్దు చేయాలని భావిస్తున్నట్టు టీజీపీఎస్సీ వర్గాల ద్వారా తెలిసింది. ఎందుకంటే కోర్టు ఆదేశాల మేరకు రీవాల్యూయేషన్ చేస్తే అంతులేని కథలా మారుతుందని, చిక్కుముడులు వీడేందుకు కొన్నేండ్లు పడుతుందని..అందుకే రద్దు చేయడమే మేలని భావిస్తున్నట్టు సమాచారం.
డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుకు కోర్టులంటే లెక్కేలేదని, అందుకే అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నదని ఆరోపిస్తున్నారు. కొందరు అభ్యర్థుల మేలు కోసం లక్షల మంది జీవితాలతో ఆటాడుకుంటున్నదని మండిపడుతున్నారు. వెంటనే హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.