హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 పోస్టులు అమ్మకమంటూ సోషల్మీడియాలో ప్రచారం జరగడంతో టీజీపీఎస్సీ స్పందించింది. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తిచేసిన వారిపై బుధవారం బేగంబజార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. దీంతోపాటు సైబర్ క్రైమ్స్ డీసీపీకి సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేసింది. ఇక గ్రూప్-1పై సోషల్మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను కమిషన్ ఖండించింది.
ఆశావాహుల్లో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించిన వారిపై క్రిమినల్ పరువునష్టం దావా వేయాలని నిర్ణయించినట్టు కమిషన్ ఇన్చార్జి కార్యదర్శి సుమతి తెలిపారు. గ్రూప్-1 ఫలితాలను పారదర్శకంగా, మెరిట్ ప్రకారం ప్రాసెస్ చేస్తున్నామని, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ఏ అభ్యర్థికీ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. త్వరలోనే అభ్యర్థి లాగిన్లో పేపర్వారీగా మార్కులు, ప్రొవిజినల్ మార్కుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో ప్రచురిస్తామని వెల్లడించారు.