మొత్తం 46 సెంటర్లు ఏర్పాటు చేస్తే 10 -15 సెంటర్ల నుంచే మొత్తం టాపర్లున్నారు. మిగతా సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరూ లేరు. టాప్ 1000లో మూడు సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేరు. ఇదేలా సాధ్యం? ఒక సెంటర్ నుంచి 970 -950 మంది రాస్తే టాప్ 500లో ఒక్కరూ లేకపోవడమేమిటి?. టాప్ 500లో కోఠి మహిళా కాలేజీలోని రెండు సెంటర్లలో రాసిన అభ్యర్థులే 74 మంది ఎలా ఎంపికయ్యారు? టాప్ 100, టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా ఎందుకు లేరు?
– అభ్యర్థుల అభ్యంతరాలివి
Group 1 Mains | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : గ్రూప్ -1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను ఉగాది పర్వదినాన టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 21,085 మంది అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది. టాప్ -10లో ఆరుగురు మహిళలుండగా, నలుగురు పురుష అభ్యర్థులున్నారు. మొత్తం 900 మార్కులకు 550 మార్కులతో జనరల్ క్యాటగిరీకి చెందిన మహిళా అభ్యర్థి టాపర్‌గా నిలిచారు. ఈ ఫలితాలపై అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇందులో చాలా అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. మెయిన్స్ మూడో ర్యాంకును నాన్ లోకల్ అభ్యర్థి ఎగరేసుకుపోయారు. టాప్ 10లో బీసీలు ముగ్గురు ఉంటే, మిగతా వారంతా ఓసీలే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఒక్కరు కూడా టాప్ 10లో లేరు. ఇక టాప్ -20లో ఒక ఒక్క ఎస్టీ అభ్యర్థి ఉండగా, ఎస్సీలు ఒక్కరు కూడా లేరు. ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేశారని ఆయా వర్గాల అభ్యర్థులు మండిపడుతున్నారు.
ఇక రీ కౌంటింగ్ పెట్టుకున్న వారికి ఒక్క మార్కు కూడా పెరగలేదు. 20వ ర్యాంకును కూడా నాన్ లోకల్ అభ్యర్థే కైవసం చేసుకోవడం గమనార్హం. ఇలా గ్రూప్ -1 మెయిన్స్ మూల్యాంకనంపై అభ్యర్థులు పలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీలోని సెంటర్లలో పరీక్షలు రాసిన వారే టాపర్లుగా నిలిచారని ఆరోపిస్తున్నారు. కోఠి మహిళా కాలేజీలోని రెండు సెంటర్లలో పరీక్ష రాసిన వారిలో 74 మంది టాప్ 500లో నిలిచారు. ఉర్దూలో రాసిందే 9 మంది కాగా, ఓ మహిళా అభ్యర్థికి 18వ ర్యాంకు వచ్చింది. ఇదెలా సాధ్యమని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఫలితాల్లో ఒకే మార్కు మీద పదుల సంఖ్యలో అభ్యర్థులున్నారు. కొన్ని మార్కులపై 20 -30 మందిదాకా అభ్యర్థులుండటం గమనార్హం.
తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని, మార్కులు తక్కువ వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి అశోక్‌నగర్‌లో పోస్టర్లు వెలిశాయి. ‘టీజీపీఎస్సీని ఏలుతున్నది బహుజనులే అయినా బహుజనుల బతుకులు నాశనం’ అంటూ వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ‘గ్రూప్ -1లో పాడె మీదికి తెలుగు భాష’.. ‘తెలంగాణ తెలుగోడా గ్రూప్ -1 అన్యాయంపై గొంతెత్తరా’.. ‘తెలుగు భాష ప్రామాణికం కాదు- టీజీపీఎస్సీ’, ‘తెలుగులో రాస్తే నీ మెడకు ఉరితాడే, తెలుగులో రాస్తే మార్కులు వేయం – టీజీపీఎస్సీ’, ‘తెలుగు భాష అంటే తన్నుడే – టీజీపీఎస్సీ’, ‘తెలుగుభాషను చంపుతున్నా పట్టించుకోని తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ’ అని పేర్కొంటూ పోస్టర్లు వేశారు. టీజీపీఎస్సీ తీరును నిరిసిస్తూ నిరుద్యోగులు ఈ పోస్టర్లు వేసినట్టు నిరుద్యోగ జేఏసీ నేత జనార్ధన్ తెలిపారు.
మెయిన్స్ మూల్యాంకనంలో అనేక అవకతవకలు జరిగినయి. పేపర్ -4 పర్యావరణం సబ్జెక్టును దిద్దేందుకు వాల్యుయేటర్లను పెట్టలేదు. ఒక్క జనరల్ ఎస్ఏ పేపర్‌ను దిద్దడానికి ఏడు సబ్జెక్టుల నుంచి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి 10 రకాల సబ్జెక్టు నిపుణులుండాలి. కానీ అనుభవం లేని డిగ్రీ లెక్చరర్లతో పేపర్లు దిద్దించారు. సెలవు దినాల్లో జీఆర్ఎల్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తున్నది.
– జనార్ధన్
మెయిన్స్ పరీక్షలు సహా ఫలితాల ప్రకటనలో టీజీపీఎస్సీ వైఖరి సందేహాస్పదంగా ఉన్నది. జీఆర్ఎల్ చూస్తుంటే ఇది గ్రూప్ -1 పరీక్షనా? లేక పదో తరగతి పరీక్షనా? అన్న సందేహాలు వస్తున్నాయి. రెండు సెంటర్ల నుంచే టాప్ 500లో 75 మంది ఉన్నారు. ఈ రెండు కేంద్రాల్లోనే అత్యధిక మార్కులు రావడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. మెయిన్స్ ఆన్సర్ షీట్లను తిరిగి మూల్యాంకనం చేయాలి. గ్రూప్ -1 రిక్రూట్మెంట్లో భారీ అక్రమాలు జరిగినట్టు తెలుస్తున్నది. గ్రూప్-1 రిక్రూట్మెంట్పై జ్యూడీషియల్ కమిషన్‌ను వేసి విచారణ జరపాలి.
– భరత్‌రెడ్డి