హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 563 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 897 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు సూచించారు. ఉదయం 10 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. గేట్లు మూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తెరిచే ప్రసక్తే లేదని, నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టంచేశారు. నిబంధనల నోట్‌ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. పరీక్షలు సజావుగా నిర్వహించడం కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు.