TGPSC | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : టీజీపీఎస్సీ ఆర్థికంగా కష్టాల్లో ఉందని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వ్యాఖ్యానించారు. ఏటా యూపీఎస్సీకి ఇచ్చే నిధులు ఏప్రిల్ 1న ఠంచన్‌గా ఖాతాలో పడుతున్నాయని, కానీ మన దగ్గర ఆ పరిస్థితిలేదని వా పోయారు. బడ్జెట్‌ను అడుక్కోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేక బయోమెట్రిక్ హాజరును ఇంప్లిమెంట్ చేయలేకపోయామని గతంలో కమిషన్ హైకోర్టుకు చెప్పిందని గుర్తుచేశారు. బుధవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇక పోటీ పరీక్షల సిలబస్, పరీక్షల విషయంపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. గ్రూప్-2లో నాలుగు, గ్రూప్-3లో మూడు పేపర్లున్నాయని, ఇన్ని పేపర్లు అవసరమా..? అన్న కోణంలో అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో యూపీఎస్సీ, ఎస్సెస్సీ అనుసరించనున్నట్టు పేర్కొన్నారు. కొన్ని పరీక్షలు ఆన్లైన్ లో, మరికొన్ని ఆఫ్‌లైన్ లో నిర్వహిస్తామన్నా రు. ఇక నుంచి ప్రశ్నపత్రాల విధానాన్ని మారుస్తామని, 5-10వేల ప్రశ్నలతో ప్రశ్నల నిధిని(క్వశ్చన్బ్యాంక్) రూపొందించనున్నామని పేర్కొన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ గల పోస్టులను ఏడాదిలో, మరికొన్ని పోస్టులను 6-8 నెలల్లో, ఇంకొన్నింటిని మూడు నాలుగు నెలల్లో భర్తీచేసేచేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మార్చి 31లోపు గ్రూప్-1, 2, 3 ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో గ్రూప్-2 ప్రాథమిక ‘కీ’ని విడుదల చేస్తామని పేర్కొన్నారు.
11, 12న జాతీయ స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల కాన్ఫరెన్స్ బెంగళూరులో జరగనుందని బుర్రా వెంకటేశం తెలిపారు. సదస్సులో పలు రాష్ర్టాల చైర్మన్లతో భేటీ అయ్యి, ఉత్తమ విధానాలపై అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. ఇక 23న యూపీఎస్సీ చైర్పర్సన్ హైదరాబాద్ రానున్నారని, ఇంటర్వ్యూ విధానంపై మార్పులపై ఆస్కీలో సదస్సు ఉంటుందని వెల్లడించారు.