హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా మెరుగైన పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల్లో ఒక డీఏను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. నూతనంగా ఎన్నికైన టీజీవో కార్యవర్గ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్‌రావు, ఏనుగుల సత్యనారాయణ నేతృత్వంలో ప్రతినిధి బృందం శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, డీఏ ఏరియర్స్‌ను చెల్లించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు. సీపీఎస్ రద్దు, సాధారణ బదిలీలు, ఉద్యోగులు, పెన్షనర్లకు ఈహెచ్ఎస్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీఎంను కోరామని టీజీవో సంఘం బాధ్యులు తెలిపారు.