DA | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం నుంచి డీఏ చెల్లింపు ప్రకటన వస్తుందని ఆశ గా ఎదురుచూసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నిరాశే మిగిలింది. శుక్రవారం సాయంత్రంలోగా శుభవార్త చెబుతామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మిన వాళ్లు హామీ ఉత్తదే కావడంతో నిట్టూర్చారు. గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలతో రేవంత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెడింగ్ డీఏలను విడుదల చేయాలని జేఏసీ నేతలు కోరారు.
శుక్రవారం సాయంత్రంలోగా డీఏలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ప్రకటన చేస్తారని రేవంత్ తెలిపారు. దీంతో కనీసం రెం డు డీఏలైనా విడుదల చేస్తారని అం తా భావించారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందన్న ఆశల్లో సంఘాల నేతలు తేలియాడారు. కానీ భట్టి విక్రమార ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. డీఏలపై ప్రకటన వెలువడకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆశలు ఆవిరయ్యాయి. డిప్యూటీ సీఎం అందుబాటులో లేకపోవడం, శుభవార్త రాకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతల్లో అసంతృప్తి నెలకొంది. సీఎం మాట కూడా ఉత్తముచ్చటే అయింది కదా అని అసంతృప్తి చెందుతున్నారు.