TG PGECET | హైదరాబాద్, జూన్ 25, (నమస్తే తెలంగాణ ) : ఎంఈ/ ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ పీజీ ఈసెట్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. కూకట్పల్లిలోని జేఎన్టీయూలో మధ్యాహ్నం 3:30 గంటలకు అధికారులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, జేఎన్టీయూ ఉప కులపతి ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డిలు ఈ ఫలితాలను విడుదల చేస్తారని పీజీ ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అరుణకుమారి తెలిపారు. ఈ పరీక్షలను జూన్ 16 నుంచి 19 వరకు నిర్వహించిన విషయం విదితమే.