Sada Bainama | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీచేసిన జీవో 112 అమలుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో ఆ జీవో అమలును నిలిపివేసిన హైకోర్టు.. తాజాగా ఆ స్టే ఉత్తర్వులను కొనసాగించబోమని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. జీవో 112ను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఆర్వోఆర్ యాక్ట్-71 రద్దయి, భూభారతి చట్టం అమల్లోకి వచ్చినందున పాత చట్టంలోని నిబంధనలపై స్టే తొలగించాలని ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది.
ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. భూములను క్రమబద్ధీకరణకు దాదాపు 9.25 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అనంతరం పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది జే ప్రభాకర్ వాదన వినిపిస్తూ.. కొత్త చట్టంలోని నిబంధనలను సవాలు చేస్తూ సవరణ పిటిషన్ వేశామని, వారం రోజులు గడువిస్తే కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ తాజాగా మరో పిటిషన్ వేస్తామని చెప్పారు.
అప్పటి వరకు స్టే కొనసాగించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించినందున పాత చట్టంపై స్టేను కొనసాగించబోమని వెల్లడించింది. కావాలనుకుంటే కొత్త చట్టంలోని నిబంధనలను సవాలు చేస్తూ తాజాగా మరో వ్యాజ్యం దాఖలు చేసుకోవచ్చునని పిటిషనర్‌కు సూచిస్తూ.. ఆయన పిల్‌పై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది.