హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్/ బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఈసెట్ రాయాల్సి ఉంటుంది. ఈ నెల 25న ఈసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిలో శనివారం నిర్వహించిన సెట్ కమిటీ సమావేశంలో ఈసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500, మిగతా వారు రూ. 900 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మే 12న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు.