EAPCET | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మంగళ, బుధవారాల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ(ఏపీ) విభాగానికి పరీక్షలు జరగనుండగా, గురువారం విరామం ప్రకటించారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్లో 7:30 గంటలు, మధ్యాహ్నం సెషన్లో 1:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లో పరీక్షకు అనుమతించబోమని ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు.
అభ్యర్థులు వీలైనంత మేరకు ఆఖరులో కాకుండా గంట ముందుగా పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలి. ఎందుకంటే వెరిఫికేషన్, బయోమెట్రిక్ నమోదుకు కాస్త సమయం పడుతుంది. ఆ తర్వాత కంప్యూటర్ కేటాయింపు, లాగిన్ కావడం, పాస్వర్డ్ నొక్కడానికి మరింత సమయం పడుతుంది. ఈ తంతు పూర్తయితేనే విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తారు. మొత్తంగా 5 నుంచి 10 నిమిషాలు పట్టొచ్చు. సరిగ్గా పరీక్షా సమయానికే సర్వర్ ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచే పరీక్ష ప్రారంభమైనట్టు లెక్క. ఈ నేపథ్యంలో విద్యార్థులు తొందరగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అగ్రికల్చర్, ఫార్మసీకి 112, ఇంజినీరింగ్‌కు 124 సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఎప్‌సెట్ పరీక్షకు కరెంట్ కోతల భయం పట్టుకుంది. పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తుండటంతో కరెంట్ సమస్య పట్టిపీడిస్తున్నది. ఎండలు ముదిరిపోవడం, విద్యుత్తు వినియోగం పెరగడంతో ఎక్కడ ఏ సమస్య తలెత్తుతుందో.. ఏ ఉపద్రవం వచ్చిపడుతుందోనన్న టెన్షన్ అధికారులను వణికిస్తున్నది. నిరుడు కరీంనగర్ జిల్లా వాగేశ్వరి కాలేజీ సెంటర్లో కరెంట్ సమస్య తలెత్తింది. పరీక్ష మధ్యలో నిలిచిపోయింది. రెండు గంటలు ఆలస్యంగా కరెంట్ పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఈ సారి మూడు రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదటిది విద్యుత్తు సరఫరా కాగా, రెండోది యూపీఎస్, మూడోది జనరేటర్. యూపీఎస్, జనరేటర్లు ఉన్న వాటిల్లోనే పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో విద్యుత్తు కోతల్లేకుండా చూడాలని, అంతరాయం లేని విద్యుత్తు అందించాలని విద్యుత్తు సంస్థల అధికారులకు ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ అధికారులు లేఖలు రాశారు.