నడిగూడెం, జూలై 15: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. వివరాలు ఇలా.. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన నిమ్మ వెంకటేశ్వర్లు-వసుంధర దంపతుల కుమార్తె తనుషా మహాలక్ష్మి (15) కేజీబీవీలో పదోతరగతి చదువుతున్నది. సోమవారం రాత్రి 11 గంటల వరకు పాఠశాలలోని రీడింగ్ రూంలో తోటి విద్యార్థినులతో కలిసి చదువుకున్నది. అర్ధరాత్రి సమయంలో తోటి విద్యార్థిని చున్నీ కావాలని అడిగింది. తెల్లవారుజూమున తనుషా కనిపించకపోవడంతో క్లాస్‌రూంలో గాలించగా చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా వేలాడుతూ కన్పించింది. విషయం తెలుసుకున్న డీఈవో అశోక్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై అజయ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చదువులో ముందుండే తనుషా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదో తెలియడం లేదని ఉపాధ్యాయులు, విద్యార్థినులు పేర్కొన్నారు. విద్యార్థిని తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అజయ్‌కుమార్ తెలిపారు.