తిరుమలగిరి, అక్టోబర్ 17: అసైన్డ్ పట్టా భూముల్లో భూమి పూజ చేయవద్దని ఎమ్మెల్యేను అడ్డుకున్న ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో చోటు చేసుకున్నది. దీంతో రైతులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించే యత్నం చేశారు. నిరసనగా వారు పెట్రోల్ డబ్బాలతో ఆత్మహత్యాయత్నం చేయడానికి యత్నించగా, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. ముప్ఫై ఏండ్ల క్రితం గ్రామంలోని సర్వే నంబర్ 98లో రైతులు చిత్తలూరి కృష్ట, చిత్తలూరి సోమయ్య, చిత్తలూరి సురేశ్, పోరెల్ల వేణు, పోరెల్ల పెంటయ్య కుటుంబాలకు ప్రభుత్వం ఏడు ఎకరాల భూమి ఇచ్చింది. నిరుడు అక్టోబర్ 6న ఈ సర్వే నంబర్లోని 22 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే మందుల సామేల్ ఆధ్వర్యంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కోసం శంకుస్థాపన చేశారు. కాగా శుక్రవారం ఇంతకు ముందు నిర్ణయించిన భూముల్లో కాకుండా, వీరి భూముల్లో రెండోసారి భూమి పూజ నిర్వహించడంతో ఆందోళనకు దిగారు.
అభివృద్ధికి తాము అడ్డుపడమని కానీ, భూమికి బదులు మరో చోట భూమి చూపించాలని లేదా పరిహారమైనా ఇప్పించాలని రైతు కుటుంబాలు ఎమ్మెల్యేతో వాదనకు దిగారు. దీంతో పోలీసులు రైతులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. నిరసనగా రైతు కుటుంబాలు పెట్రోల్ డబ్బాలతో పోలీసుల వాహనం ఎదుట బైఠాయించారు. ఎలాంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా తమ భూములను ఎలా లాక్కుంటారని ఆత్మహత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. చివరికి పోలీసులు వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భూమి పూజ అనంతరం వదిలి పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆ భూముల్లో తాము దశాబ్దాలుగా సేద్యం చేసుకుంటున్నామని, ఇప్పుడు ప్రభుత్వమే లాక్కుంటే, తాము ఎలా బతకాలని, ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని డిమాండ్ చేశారు.