హైదరాబాద్: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు (Telugu Students) క్షేమంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో బర్మింగ్‌హామ్‌లోని కెల్లామ్ స్ట్రీట్‌లో ఉన్న రెండు అపార్టుమెంటుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్ మొత్తానికి వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అపార్టుమెంట్లలో ఉన్న పది మంది విద్యార్థులను రక్షించారు. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో దవాఖానకు తరలించారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
బాధితులంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులని పేర్కొన్నాయి. వారు అలబామా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారని తెలిపాయి. అపార్టుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయని వెల్లడించాయి. శనివారం సాయంత్రం 6.20 గంటలకు బిల్డింగ్‌లో మంటలు వ్యాపించాయని బాధితుల్లో ఒకరు ఇన్‌స్టా పోస్టు ద్వారా వెల్లడించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, వేగంగా అపార్టుమెంట్ మొత్తం వ్యాపించాయని తెలిపారు. అందరం వెనుక డోర్ నుంచి బయటకు వచ్చేశామని, కానీ ఒకరు మాత్రం పొగలు దట్టంగా అలముకోవడంతో అందులో చిక్కుకుపోయాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగానే ఉన్నదని అందులో తెలిపారు. అగ్నిప్రమాదం నుంచి తాము బయటపడటం చాలా గొప్పవిషయమని చెప్పారు.