e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home Top Slides సీతారామ స్వామీ.. నీ భూములు కనబడవేమీ!

సీతారామ స్వామీ.. నీ భూములు కనబడవేమీ!

సీతారామ స్వామీ.. నీ భూములు కనబడవేమీ!
 • దేవరయాంజాల్‌లో దేవుడి భూమి అన్యాక్రాంతం
 • 1000 కోట్ల భూమి స్వాహా
 • ఈటల భార్య పేరిట 30 ఎకరాలు ఆక్రమణ
 • బినామీల పేరిట వందల ఎకరాల్లో కబ్జాలు
 • ఆక్రమిత స్థలాల్లో భారీ గోదాముల నిర్మాణం
 • ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు
 • బినామీల పేర 174 ఎకరాల్లో 155 గోడౌన్లు
 • ఇందులో 30.61 ఎకరాలు ఈటల గుప్పిట్లో

చరిత్రను చెప్పి చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోలేరని మరోసారి రుజువైంది..! మంత్రి ఈటల భూదందాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌ శివారు శామీర్‌పేట సమీపంలోని దేవరయాంజాల్‌లో సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందిన వందల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, అందులో 30 ఎకరాల దాకా ఈటల కుటుంబం పేరిట ఉన్నాయని వెల్లడైంది. మిగతా భూములు కూడా ఆయన సన్నిహితులు, బినామీల పేరిట ఉన్నట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తమ ఎకరన్నర భూమిని ఈటల అన్న కొడుకు వికాస్‌ ఆక్రమించారని శామీర్‌పేట – ఉప్పర్‌పల్లికి చెందిన ఒక దళిత కుటుంబం ఆరోపించింది. అదేమని అడిగితే తమపై దాడులకు దిగుతున్నారని, మంత్రి ఈటలకు మొరపెట్టుకున్నా ఎలాంటి ఫలితం దక్కలేదని వారు పేర్కొన్నారు. దాడులతో భయభ్రాంతులకు గురవుతున్న ఆ కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు శనివారం అర్ధరాత్రి ప్రగతిభవన్‌ వద్దకు వచ్చారు. వారి ఫిర్యాదు లేఖను అక్కడి భద్రతా సిబ్బంది తీసుకొని ముఖ్యమంత్రికి పంపించారు.

దేవరయాంజాల్‌! హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో మేడ్చల్‌ జిల్లా, శామీర్‌పేట మండలంలో ఉన్న ఓ గ్రామం. ఇక్కడి సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి ఆరు వందల ఏండ్ల చరిత్ర ఉన్నది. రాష్ట్రంలో ఏ దేవాలయానికీ లేనంతగా 1500 ఎకరాలకుపైగా దేవుడి మాన్యాలు ఉన్నాయి. ప్రముఖ బ్యాంకర్‌, కాంట్రాక్టర్‌గా సేవలందించి, వైస్రాయ్‌ అండ్‌ గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా ‘రావు బహద్దూర్‌’ బిరుదును పొందిన రామిని పుల్లయ్య.. సీతారామచంద్రస్వామికి పరమ భక్తుడు. పుల్లయ్య సేవా దృక్పథానికి మెచ్చిన నిజాం ప్రభుత్వం ఆయనకు దేవాలయం పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సుమారు 1531.13 ఎకరాల భూమిని ఈనాంగా ఇచ్చింది. ఈ భూమిని పుల్లయ్య తదనంతర కాలంలో దేవాలయానికి రాసిచ్చినట్టు రికార్డులు చెప్తున్నాయి. అసలు యాంజాల్‌కు దేవర అనే పదం జత చేరింది కూడా ఈ గుడిద్వారానేనని చెప్తారు. ఇంతటి విశిష్టత ఉన్న రాములోరి గుడి మాన్యాలు.. ఇప్పుడు అక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. 1976 నుంచి కొనసాగిన కబ్జా పర్వాల్లో మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం, ఆయన బినామీలూ ఉన్నారనేది తాజా విషయం. ఇక్కడ ఈటల కుటుంబం పేరిటే దాదాపు 30 ఎకరాల భూమి ఉన్నది. రిజిస్ట్రేషన్లకు వీలుకాని ఈ భూమి.. నిబంధనలను తప్పించుకుని.. రికార్డులకు ఎక్కడం విశేషం.

ఓ పక్క తానేమీ అక్రమాలు చేయలేదంటారు. ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తారు. కానీ.. తవ్వుతున్నకొద్దీ మంత్రి ఈటల రాజేందర్‌ భూముల ఆక్రమణలకు సంబంధించిన వార్తలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈటల కుటుంబం, ఆయన బినామీలు కలిసి దాదాపు వెయ్యి కోట్ల విలువైన వందల ఎకరాల దేవుడి మాన్యాన్ని కబ్జాచేశారన్న ఆరోపణలున్నాయి. నా జేబులు నిండితే చాలన్నట్టు నగర శివారులోని మేడ్చల్‌ జిల్లా, శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్‌ రహదారి పక్కనే దేవరయాంజాల్‌ గ్రామ రెవెన్యూ పరిధిలో ఈ భూమిని ఆక్రమించడమే కాకుండా.. వాటిలో ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ గోదాములను నిర్మించి దందా చేస్తున్న వైనం తాజాగా సంచలనం రేపుతున్నది.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

సీతారామ స్వామీ.. నీ భూములు కనబడవేమీ?

తెలంగాణలో అత్యధిక దేవుడి మాన్యం ఉన్నది మేడ్చల్‌ జిల్లా, శామీర్‌పేట్‌ మండల పరిధిలోని దేవరయాంజాల సీతారామచంద్రస్వామి ఆలయానికే. దాదాపు 1461 ఎకరాల భూమి రాముడికి ఉన్నది. 1976 నుంచే ఈ దేవుడి మాన్యం ఆక్రమణలకు గురైంది. అయినా ఎండోమెంట్‌, రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించారు. దీంతో కోట్ల విలువైన దేవాలయ మాన్యాలు నేడు మాయమైనాయి. ఈ వ్యవహారంపై ఓ వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో మేల్కొన్న ఎండోమెంట్‌ అధికారులు ఈ భూములు ఆలయానివేనంటూ నివేదిక సమర్పించారు. సర్వే నంబర్‌ 55 నుంచి 63 వరకు, 212 నుంచి 218 వరకు, 513 నుంచి 586 వరకు, 639 నుంచి 699 వరకు, 700 నుంచి 737 వరకు ఎండోమెంట్‌ భూమి ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొత్తం సర్వే నంబర్లలో సుమారు 1461.19 ఎకరాల స్థలం ఉన్నట్లు స్పష్టంచేస్తున్నారు. ఎండోమెంట్‌ రికార్డుల్లో మాత్రం సుమారు 1500 ఎకరాల వరకు ఉన్నట్టు నమోదైంది.

గోదాముల్లో దందాలు

ఈటల బినామీల్లో కొందరు ఓ ఎంపీ (టీఆర్‌ఎస్‌ కాదు)కి కూడా బినామీలుగా వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ ఇద్దరూ కలిసి దేవుడి మాన్యాన్ని ఆక్రమించుకోవడంతోపాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే కోట్లలో వ్యాపారం చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈటల బినామీలను విచారిస్తే కోట్ల విలువైన అక్రమ వ్యాపారాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. ఈ భూమిలో ఐదు నుంచి పదెకరాల్లో అతి పెద్ద గోదాములను హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందకుండానే 2016లో నిర్మించారు. మరో రెండెకరాల్లో ఇంకో గోదామును కట్టారు. దేవరయాంజాల్‌లోని ఎండోమెంట్‌ భూముల్లో ఈటల రాజేందర్‌, ఈటల జమునతోపాటు వారి బినామీల ఆక్రమణలో ఉన్నది 389.12 ఎకరాల విస్తీర్ణం కాగా, అందులోని 174.16 ఎకరాల్లో 115 భారీ కమర్షియల్‌ గోదాములను అనధికారికంగా నిర్మించారు. ఇందులో ఏ ఒక్క గోదాముకు కూడా కనీస అనుమతులు లేవని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ ఈ గోదాములలో ఏం వ్యాపారం నడుస్తుందో ఎవ్వరికీ తెలియదని, ముందస్తు అనుమతి లేకుండా ఆ గోదాముల్లోకి పోలీసులు, ఉన్నతాధికారులు కూడా ప్రవేశించలేరని స్థానికులు చెప్తున్నారు.

దేవరయాంజాల్‌ సీతారామచంద్రస్వామి ఆలయానికి వేర్వేరు సర్వే నంబర్లలో 1461 ఎకరాల మాన్యాలు ఉన్నాయి. ఇందులో సర్వే నంబర్‌ 56లో సుమారు 15.33 ఎకరాలు, సర్వే నంబర్‌ 57/డీలో సుమారు 15.28 ఎకరాలు.. మొత్తం 30.61 ఎకరాల భూమి మంత్రి ఈటల రాజేందర్‌ భార్య జమున పేరిట ఉన్నది. నిజానికి ఇది ఎండోమెంట్‌ భూమి కావడంతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేదు. కానీ.. తన పలుకుబడిని ఉపయోగించిన మంత్రి ఈటల.. ఈ భూములను నోటరీలపై కొన్నట్టు పత్రాలు సృష్టించారు. అనంతరం ఎండోమెంట్‌, రెవెన్యూ అధికారులను అనుకూలం చేసుకొని, తన భార్య కబ్జాలో ఉన్నట్టుగా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు చేయించుకొన్నారు. ఇదే పద్ధతుల్లో అనేక ఎకరాలను తన బినామీల పేరిట నమోదు చేయించుకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ భూముల్లో నిర్మించిన గోదాములను కూల్చివేసేందుకు స్థానిక పంచాయతీ అధికారులు వెళ్తే స్వయంగా ఈటలతోపాటు ఆయన బినామీలు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి.. భయాందోళనలకు గురిచేసినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. తక్కువలో తక్కువ ఫైన్‌ వేయాలి కానీ కూల్చేస్తే ఖబర్దార్‌ అని వారు బెదిరింపులకు దిగినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే హెచ్‌ఎండీఏతోపాటు స్థానిక పంచాయతీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

మంత్రి ఈటల భార్య జమున ఆక్రమణలో సర్వే నంబర్‌ 56లో.. 15.33 ఎకరాలు
సర్వే నంబర్‌ 57/డీలో 15.28 ఎకరాలు

బినామీల పేర వందల ఎకరాలు

 • ఎప్పుడూ విలువల గురించి మాట్లాడే ఈటల తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు బినామీలను నియమించుకొన్నారు.
 • ఈటల బినామీలైన సాద కేశవరెడ్డి (తండ్రి పేరు వెంకట్‌రెడ్డి) పేర సర్వే నంబర్‌ 58లో 13.08 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో ఆరు గోదాములను నిర్మించారు.
 • సర్వే నంబర్‌ 62లోనూ 14.01 ఎకరాలను సాద కేశవరెడ్డి పేర నమోదు చేయించారు. ఇందులో ఒక ఎకరాలో గోదాము కట్టారు.
 • సర్వే నంబర్‌ 674లోని 16.14 ఎకరాల భూమిని ఈటల రాజేందర్‌ తన బినామీ అయిన సాద వసంత్‌రెడ్డి (తండ్రి పేరు లింగారెడ్డి) అనే వ్యక్తి పేర రాయించారు. ఇందులోని 3 ఎకరాల జాగాలో ఎస్వీఆర్‌ ఫంక్షన్‌హాల్‌ నిర్మించారు. దీనికి ఎలాంటి అనుమతిలేదు.
 • సర్వే నంబర్‌ 690లోని 19.20 ఎకరాల్లో సాద జనార్దన్‌రెడ్డి కబ్జాలో ఉన్నాడు. ఇందులో మొత్తం 11 గోదాములను నిర్మించారు. ఈయన కూడా ఈటల బినామీయేనని స్థానికులు చెప్తున్నారు.
 • సాద ఇంద్రసేనారెడ్డి సర్వే నంబర్‌ 691లో సుమారు 20.11 ఎకరాల విస్తీర్ణంలో కబ్జాలో ఉన్నారు.
 • సర్వే నంబర్‌ 715లో 8.10 ఎకరాలు సాద నర్సింహారెడ్డి, సాద రత్నకళ, 17.01 ఎకరాల్లో, సర్వే నంబర్‌ 730లో 7.03 ఎకరాల్లో పీసరి సుధాకర్‌రెడ్డి (తండ్రి పేరు కృష్ణారెడ్డి) (3 గోదాములు) ఉన్నారు.
 • సర్వే నంబర్‌ 731లో సుమారు 7.25 ఎకరాల స్థలంలో ఈటల బినామీలు కబ్జాలో ఉన్నారు.
సీతారామ స్వామీ.. నీ భూములు కనబడవేమీ!

2.40 లక్షల భూమికి 28 కోట్ల రుణం!


ప్రభుత్వ భూమి తనఖా పెట్టి దర్జాగా అప్పు తీసుకున్న మంత్రి ఈటలపై ఆరోపణల్లో కొత్త కోణం

హైదరాబాద్‌, మే 1 (నమస్తే తెలంగాణ): రూపాయి విలువ చేసే ఆస్తిని కుదువపెడితే ఎవరైనా రూ.వెయ్యి అప్పు ఇస్తారా? అది కూడా ప్రభుత్వ భూమిని తనఖా పెడితే? రుణం ఇచ్చింది ప్రభుత్వరంగ బ్యాంకు అయితే? ఈటల రాజేందర్‌ భూ కబ్జా వ్యవహారంలో కొత్తగా తెరమీదికి వచ్చిన విచిత్రం ఇది. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని సర్వే నంబర్‌ 130లో సీలింగ్‌ భూమి ఉన్నది. ఇందులో 3 ఎకరాలు ‘133/అ’ సర్వే నంబర్‌తో కొల్లి సీతారామారావు పేరుమీదికి మారింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 23వ తేదీన కొల్లి సీతారామారావు నుంచి ఈటల భార్య ఈటల జమున తన ‘జమున హ్యాచరీస్‌’ పేరుమీద కొనుగోలు చేసినట్టు రికార్డులను బట్టి తెలుస్తున్నది. అప్పుడు మార్కెట్‌ విలువను రూ.2.40 లక్షలుగా పేర్కొన్నారు. సరిగ్గా ఏడాది తర్వాత ఈ మూడెకరాలను 2020 ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లోని కెనరా బ్యాంక్‌లో తనఖా పెట్టి రూ.28.25 కోట్ల రుణం తీసుకున్నట్టు రికార్డులను బట్టి తెలుస్తున్నది. మార్కెట్‌ విలువ కేవలం రూ.2.40 లక్షలు ఉన్న భూమికి, అది కూడా ప్రభుత్వ భూమికి సుమారు వెయ్యి రెట్లు అధికంగా రుణం ఇవ్వడం పట్ల విస్మయం వ్యక్తమవుతున్నది. ఈటల పక్కా పథకం ప్రకారమే సీలింగ్‌ భూమిని పట్టా భూమిగా మార్చి, ఆ తర్వాత కొనుగోలు చేశారని, తనఖా పెట్టి రుణం తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం 133/అ సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో ఉంచింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీతారామ స్వామీ.. నీ భూములు కనబడవేమీ!

ట్రెండింగ్‌

Advertisement