హైదరాబాద్: తెలంగాణ(Telangana Weather)లో మధ్యాహ్నం పూట ఎండలు చంపేస్తున్నాయి. అయితే రాబోయే 48 గంటలకు చెందిన ఓ గుడ్‌న్యూస్ వినిపించింది. రాబోయే రెండు రోజులు తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణశాఖ నిపుణుడు టీ బాలాజీ తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రజలకు కొంత ఉపశమనం లభించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, పెద్దపల్లి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలు కాస్త కూల్‌గా మారనున్నాయి. ఆ జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు పేర్కొన్నారు. రాత్రితో పాటు తెల్లవారుజామున కూడా టెంపరేచర్లు కూల్‌గా ఉంటాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం వేళ యధావిధిగా ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. కొంత వరకు హీట్ నుంచి రిలీఫ్ ఉంటుందన్నారు.
హైదరాబాద్ నగర ప్రజలకు కూడా కొంత గుడ్‌న్యూస్ చెప్పారు. ఇవాళ్టి రాత్రి నుంచి హైదరాబాద్‌లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు తెలిపారు. అయితే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో హీట్ ఉన్నా.. ఉదయం పూట మాత్రం టెంపరేచర్లు తగ్గనున్నట్లు వెల్లడించారు. ఇక నగర శివార ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు చెప్పారు. ఉత్తర భారతం నుంచి అకస్మాత్తుగా వీస్తున్న చలిగాలుల వల్ల ఈ మార్పు ఉంటుందన్నారు. ఉత్తర తెలంగాణ దిశగా ఆ శీతల గాలులు వీస్తున్నట్లు చెప్పారు. మార్చి 6, 7 తేదీల్లో.. ఉదయం ఉష్ణోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీల మధ్య ఉండనున్నాయి. ఇక మధ్యాహ్నం మాత్రం 35 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ ఉండనున్నది.
మార్చి 5, 7 తేదీల్లో హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో హీట్ నుంచి రిలీఫ్ ఉంటుందన్నారు. ఉదయం పూట 14 నుంచి 15 డిగ్రీల టెంపరేచర్ ఉండనున్నది. ఇక మార్చి 9వ తేదీ తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు మండనున్నాయి.
From tonight, sharp drop in temperatures ahead in North TG districts like Adilabad, Asifabad, Mancherial, Peddapalli, Nirmal, Nizamabad, Jagitial, Bhupalapally, Karimnagar districts. Night and morning will be pretty cool. Day will be warm, nice relief from heat ahead 🥶👍
— Telangana Weatherman (@balaji25_t) March 5, 2025