హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మలేషియాలో తెలుగు కోర్సులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు మలేషియాలోని రవాంగ్లో గురువారం జరిగిన సమావేశంలో మలేషియా తెలుగు సంఘం (టామ్), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ మధ్య ఒప్పందం కుదిరింది. తెలుగు యూనివర్సిటీ వీసీ వెల్దండ నిత్యానందరావు, రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, టామ్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటప్రతాప్, వైస్ ప్రెసిడెంట్స్ సత్తయ్య, సుధాకర్ నాయుడు, సరేశ్నాయుడు, గౌరవ సలహాదారు అచ్చయ్య కుమార్ సమక్షంలో ఒప్పందం జరిగింది.
ఈ సందర్భంగా వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ మలేషియాలో స్థిరపడ్డ తెలుగు భాషాభిమానులు మదిని సోమనాయుడు, డీవీ శ్రీరాములు, అప్పలనాయుడు నిరంతర కృషి ఫలితంగా తెలుగు కోర్సులు ప్రారంభంకానున్నాయని చెప్పారు. అర్ధ శతాబ్దం తర్వాత వారి కలలు సాకారం కావడం సంతోషకరమని తెలిపారు. భాషా కోర్సులతో మలేషియాలోని తెలుగువారికి ప్రయోజనం కలుగుతుందని టామ్ అధ్యక్షుడు వెంకటప్రతాప్ పేర్కొన్నారు.