హైదరాబాద్(నమస్తే తెలంగాణ): ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావుకు స్టాటిస్టిక్స్‌లో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంకశాస్త్ర రంగంలో నోబెల్ పురస్కారంగా పరిగణించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు ఆయనను వరించింది. కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన రాధాకృష్ణారావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. 62 ఏండ్ల వయస్సులో అమెరికా వెళ్లిన రాధాకృష్ణారావు.. 70 ఏండ్ల వయస్సులో ప్రొఫెసర్‌గా పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చేరారు. 82వ పడిలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఇచ్చే ప్రతిష్టాత్మక నేషనల్ మెడల్ ఫర్ సైన్స్ అవార్డును అందుకున్నారు.
1920 సెప్టెంబర్ 10న బళ్లారి జిల్లా హడగళిలోని తెలుగు కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణారావు.. ఏపీలో చదువుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, కోల్‌కతా యూనివర్సిటీలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేసి, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. పదవీ విరమణ తర్వాత అమెరికాలో స్థిరపడిన రాధాకృష్ణరావు.. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.