హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్లను ఏ ప్రాతిపదికన రూపొందించారో ఆధార పత్రాలన్నింటినీ అందించాలని తెలంగాణ సర్కారు మరోసారి డిమాండ్ చేసింది. ఈ మేరకు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ శనివారం మరోసారి లేఖను రాశారు. రూల్కర్వ్లు, జలవిద్యుత్తు తదితర అంశాలపై సీడబ్ల్యూ సీ రూపొందించిన డ్రాఫ్ట్‌పై తెలంగాణ ఇప్పటికే పలు అభ్యంతరాలను వ్యక్తంచేసింది. 1981లో నిర్వహించిన 16వ టీఏసీ సమావేశ పత్రాలను అందజేయాలని పట్టుబట్టుతూ వస్తున్నది. అయినా కేఆర్ఎంబీ సరిగా స్పందించడంలేదు. తెలంగాణ కోరిన సమాచారం ఇవ్వకుండా 1994లో నిర్వహించిన 58వ టీఏసీ సమావేశ ప్రతాలను అందజేసింది. దీనిపై తెలంగాణ మరోసారి అభ్యంతరం వ్యక్తంచేసింది. 16వ టీఏసీ సమావేశ పత్రాలను తదుపరి ఆర్ఎంసీ సమావేశ గడువులోగా తప్పక అందజేయాలని కోరింది.
ఆర్ఎంసీ సమావేశం 27కు వాయిదా
మంగళవారం నిర్వహించాల్సిన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం 27వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. వాస్తవంగా సమావేశం ఈ నెల 5న నిర్వహించాల్సిన ఉండగా 13వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు రాష్ర్టాల సాగునీటి శాఖ ఉన్నతాధికారులు అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే సమావేశాన్ని వాయిదా వేయాలని కేఆర్ఎంబీని తెలంగాణ సర్కారు కోరింది. ఈ మేరకు సమావేశాన్ని 27కు వాయిదా వేశారు.