హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14(నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్వత్సభ నవమ వార్షికోత్సవం బేగంపేటలోని జగద్గురు పుష్పగిరి మహాసంస్థానంలో ఆదివారం ఘనంగా జరిగింది. పుష్పగిరి మహాసంస్థాన పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకర భారతీస్వామి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 2026-27 పరాభవనామ సంవత్సరంలో నిర్వహించాల్సిన పండుగల తేదీలను ఖరారుచేశారు. కార్యక్రమానికి సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి అధ్యక్షత వహించగా శాస్ర్తుల వేంకటేశ్వరశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శాస్త్రీయ జ్యోతిష్యంపై సాగి కమలాకరశర్మ, వర్ధమాన సిద్ధాంతులు-ఆచరించే నియమాలపై కృష్ణమాచార్య సిద్ధాంతి, వర్ధమాన జ్యోతిష్యులు-శాస్త్రసలహాలపై మహావాది సంధ్యాలక్ష్మి, పండుగల నిర్ణయం-శాస్త్ర ప్రమాణాలపై తూండ్ల కమలాకరశర్మ తదితరులు ప్రసంగించారు. పుష్పగిరి ఆస్థాన సిద్ధాంతి ఓరుగంటి మనోహరశర్మ పరిశీలకుడిగా, విద్వత్సభ ప్రధాన కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి సమన్వయకర్తగా వ్యవహరించారు. విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ రాష్ట్ర ప్రజాసంబంధాల అధికారి జ్వాలానరసింహారావు, యాదగిరిగుట్ట ప్రధానార్చకుడు లక్ష్మీనృసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.