హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ఏ దేశంలోనైనా వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యమని, ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకమని అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎన్ఐఎఫ్ఏ) ఆర్గనైజేషన్ డైరెక్టర్ మంజిత్ మిశ్రా అన్నారు. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు విజన్ ఉన్న నాయకుడని, అందుకే ఆ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం అమెరికా పర్యటనలో భాగంగా గురువారం వాషింగ్టన్ డీసీకి వెళ్లింది. అక్కడున్న అమెరికా వ్యవసాయ విభాగం (యూఎస్డీఏ), దాని ఏజెన్సీ ఎన్ఐఎఫ్ఏలను సందర్శించి అక్కడి అధికారులతో సమావేశమైంది. వ్యవసాయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణల ప్రోత్సాహం, నిధుల కూర్పు, వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, పర్యావరణ సమతుల్యత పాటించేలా చూడటం ఎన్ఐఎఫ్ఏ లక్ష్యాలు. ఈ సందర్భంగా యూఎస్డీఏ అధికారులతో సమావేశమైన నిరంజన్‌రెడ్డి బృందం.. ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మ్యానేజ్మెంట్, మారెటింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, న్యూయర్ ప్లాంటింగ్ టెక్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాల గురించి చర్చలు జరిపింది.
తెలంగాణలో వ్యవసాయరంగ పరిశోధనలలో అమెరికా వ్యవసాయ విభాగం (యూఎస్డీఏ) సహకారం ఆశిస్తున్నట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. భావితరాలు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని చెప్పారు. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిని వివరించారు. తెలంగాణలో నీరు, విద్యుత్తు పుషలంగా ఉన్నదని, దీంతో సాగు విస్తీర్ణం పెరిగి, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను తెలంగాణ దాటిపోయిందని అన్నారు. ఈ చర్చలలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇస్టా అధ్యక్షుడు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ పాల్గొన్నారు.