నిరుద్యోగులకు ‘ప్రెసిడెన్షియల్’ షాక్!
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్న నాలుగు జిల్లాల నిరుద్యోగుల ఆశలను కాంగ్రెస్ సర్కార్ నీరుగారుస్తున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ల నిరుద్యోగుల భావోద్వేగాలతో ఆటలాడుకుంటున్నది.
- 4 జిల్లాల్లో పోలీసు ఉద్యోగార్థుల కడుపుకొట్టిన కాంగ్రెస్
- నూతన కమిషనరేట్ల మెలికతో జీవో 81 పిడుగు
- 3,200 ఖాళీలకు లక్షలాదిమంది ఎదురుచూపు
- రాష్ట్రపతి వద్ద జోన్లు, స్టేషన్ల పునర్విభజన ఫైలు
- అదే సాకుతో హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు పోస్టులే విడుదల చేయని సర్కార్
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల నిరుద్యోగుల పొట్టగొట్టేందుకు 81 అనే ఒక దొంగ జీవోను రాత్రికి రాత్రే తెచ్చారు. ఆ జీవోతో మా నోటికాడి బుక్క లాకున్నారు. అధికాదాయం, జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను పకనబెట్టి నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి. మాకు న్యాయం జరిగే విషయంలో మేము ఆమరణ నిరాహారదీక్షకైనా వెనుకాడం. అవసరమైతే త్యాగాలకూ సిద్ధమే. ఇప్పటికైనా సర్కార్ స్పందించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకూ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
– శ్రీకాంత్‌రెడ్డి, బాధిత నిరుద్యోగి
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్న నాలుగు జిల్లాల నిరుద్యోగుల ఆశలను కాంగ్రెస్ సర్కార్ నీరుగారుస్తున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ల నిరుద్యోగుల భావోద్వేగాలతో ఆటలాడుకుంటున్నది. ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ ఏర్పాటుతో తెచ్చిన జీవో 81 నిరుద్యోగుల పాలిట అశనిపాతమైంది. దొంగచాటుగా తీసుకొచ్చిన జీవో నంబర్ 81ను ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికైనా రద్దు చేస్తారేమోనని ఆశపడుతున్న నిరుద్యోగులను సర్కార్ నిరాశలోనే ఉంచి ముంచుతున్నది. ఫలితంగా ఆ నాలుగు జిల్లాల్లోని లక్షలాది మంది నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆందోళనబాట పట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యూచర్‌సిటీతో కొన్ని జోన్లు కలుపడం, కొన్ని స్టేషన్లు కొత్తగా ఏర్పాటుచేయడం, మరికొన్నింటిని పునర్విభజించి, ఆమోదం పొందేందుకు జీవో నంబర్ 81ను తీసుకొచ్చింది. ఆ వ్యవహారం మొత్తం రాష్ట్రపతి వద్ద ఆమోదం కోసం కొన్ని నెలలపాటు పెండింగ్‌లోనే ఉన్నది. ఈలోగా వచ్చిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లో ఆ నాలుగు జిల్లాల ఖాళీలను చేర్చలేదు. దీంతో ఆ జిల్లాల నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రపతి వద్ద ఆ ఫైలును కదిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని ఆయా జిల్లాల నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ‘మాకు పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడిస్తరు?’ అని ప్రశ్నించే నిరుద్యోగులకు.. ‘ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం వేచి చూస్తున్నాం.. అది క్లియర్ కాగానే నోటిఫికేషన్ ఇచ్చేస్తాం’ అంటూ రాష్ట్ర పాలకులు కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు.
గతంలోలాగా నోటిఫికేషన్లు ఇవ్వండి
నాడు జిల్లాల పునర్విభజన అనంతరం పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు నష్టపోకుండా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేయించారని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు. 33 జిల్లాలు అయినా కూడా ఉమ్మడి 10 జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ ఇవ్వడంతో అన్ని ప్రాంతాల వారూ అర్హత సాధించారని చెప్తున్నారు. కానీ ఇప్పుడూ అలాంటి పరిస్థితే వచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వం అంత్యంత కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అభ్యర్థులకు కానిస్టేబుల్ స్థాయిలో ఎలాంటి పోస్టులు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిరుద్యోగుల భావోద్వేగాలతో ఆడుకోకుండా ఉమ్మడి జిల్లాల వారీగా ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వందకు పైగా పోలీస్స్టేషన్లు, కీలక కమిషనరేట్లు ఉంటే రాష్ట్రపతి ఆమోదం పేరిట ఎలా తప్పించుకుంటారని నిలదీస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌కే దిక్కులేదు.. ఇక 2028లో మాకు పోస్టులు విడుదల చేస్తారనే నమ్మకం కూడా లేదని ఆందోళన చెందుతున్నారు. ఏపీలో కూడా ఇలాంటి సమస్యే వస్తే.. వారు కూడా ఉమ్మడి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు ఇచ్చినట్టు నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతల చుట్టూ తిరిగి అలిసిపోయాం
జీవో 81ని రద్దు కోరుతూ కాంగ్రెస్ నేతల వద్దకు వెళ్లి వేడుకుంటున్నా ఫలితం దక్కడం లేదని ఉద్యోగార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్సీలను, రాజ్యసభ ఎంపీల వద్దకు వెళ్లినా సమస్యకు మార్గం దొరుకడం లేదని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రికి తమ గోడు పట్టదా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో హాస్టల్ ఫీజులు చెల్లించలేక, గ్రౌండ్‌కు వెళ్లలేక, పుస్తకాలతో కుస్తీ పట్టలేక ఒకవైపు కుంగిపోతుంటే.. తీరా నోటిఫికేషన్లు రాక ఆందోళనకు గురవుతున్నామని చెప్తున్నారు. మాయమాటలు చెప్పి, తమ ఆందోళనలకు వంతపాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి కూడా ఇప్పడు తప్పించుకొని తిరుగుతున్నారని నిరుద్యోగులు చెప్తున్నారు.
నోటిఫికేషన్ విడుదల చేయాలని ధర్నా బీఆర్ఎస్ యూత్ విభాగం సంఘీభావం
ఎల్బీనగర్, నవంబర్ 2 : పోలీస్ నియామకాల్లో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరుద్యోగులు ప్లకార్డులు పట్టుకుని పెద్ద పెట్టున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌండ్ల రాజేందర్‌గౌడ్ హాజరై సంఘీభావం తెలిపారు. ఆ నాలుగు జిల్లాలకూ పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని రాజేందర్‌గౌడ్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నేతలు నోముల వంశీయాదవ్, శ్రీకాంత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రాజుయాదవ్, శేఖర్, ప్రత్యూష రాథోడ్, నాని, రంజిత్, గీత, భాను, శివ, చందురెడ్డి, నవీన్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
81జీవో సాకు సరికాదు
నేను యాదాద్రి భువనగిరి నిరుద్యోగిని. 81 అని ఒక సాకు చూపెట్టి.. ఈరోజు మా జిల్లా పోస్టులు భర్తీ చేయడం లేదు. 33 జిల్లాలకు గాను 29 జిల్లాల్లో పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చారు. మా జిల్లాలో నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఏందో అర్థం కావట్లే. పాత జిల్లాల ప్రకారం ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందో సమాధానం చెప్పాలి. – చంద్రశేఖర్ రెడ్డి, నిరుద్యోగి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

