ఖమ్మం రూరల్/హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రామయ్య మొక్కలకు నీరు పెట్టేందుకు బుధవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వచ్చి ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో రామయ్య స్పృహతప్పి పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయన్ను ఖమ్మంలోని ప్రభుత్వ జిల్లా ప్రధాన వైద్యశాలకు తరలించారు.
మెరుగైన వైద్యం అందించాలి: మంత్రులు
రామయ్యకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రులు టీ హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి వైద్యులను కోరారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. ఆయన త్వరగా కోరుకోవాలని వారు ఆకాంక్షించారు.