(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలు సీసాలకు సీసాల మద్యాన్ని గుంజుతున్నారు. మద్యంపై ఖర్చు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండటమే దీనికి నిదర్శనం. ఈ విషయం కన్జూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే(ఎస్పీహెచ్ఎస్) పేరిట సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) సంస్థ చేసిన తాజా సర్వేలో వెల్లడైంది. ప్రస్తుత ధరలను బట్టి ఏడాదికి తెలంగాణలో ఒక్కో పౌరుడు మద్యంపై సగటున ఖర్చు చేస్తున్న మొత్తం రూ.1,623గా ఉన్నట్టు వెల్లడైంది. తెలంగాణ తర్వాత ఏపీ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాలు మద్యంపై ఎక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ర్టాల జాబితాలో ఉన్నాయి. ఇదే సమయంలో బెంగాల్‌కు చెందిన వ్యక్తి ఏడాదికి సగటున మద్యంపై నాలుగు రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుండటం గమనార్హం.
మహిళలూ మద్యం ప్రియులే
మద్యం తాగే మహిళలు ఎక్కువగా ఉన్న టాప్-5 రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మొత్తం మహిళా జనాభాలో 24 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నట్టు ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నివేదిక వెల్లడించింది. అరుణాచల్ తర్వాతి స్థానాల్లో వరుసగా సిక్కిం (16.2 శాతం), అస్సాం (7.3 శాతం), తెలంగాణ (6.7 శాతం), జార్ఖండ్ (6.1 శాతం) రాష్ర్టాలు ఉన్నాయి