హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ తుది ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అదరగొట్టారు. పలువురు టాప్ ర్యాంకులు సాధించారు. జాతీయంగా 26 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సొంతం చేసుకోగా, వీరిలో తెలంగాణకు చెందినవారు ఐదుగురు ఉండటం విశేషం. జేఈఈ మెయిన్ తుది ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. పేపర్ -1 (బీఈ, బీటెక్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జనవరిలో జరిగిన మొదటి ఎడిషన్ పరీక్షకు 13 లక్షల మంది, ఏప్రిల్‌లో జరిగిన రెండో విడతకు 10 లక్షల మంది హాజరయ్యారు. రెండు సెషన్లకు కామన్‌గా 8 లక్షల మంది హాజరయ్యారు.
తాజా ఫలితాల్లో 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చెరో అయిదుగురు అభ్యర్థులు ఉన్నారు. రాజస్థాన్ నుంచి నలుగురు, ఢిల్లీ నుంచి ముగ్గురు, మహారాష్ట్ర, హర్యానాల నుంచి ఇద్దరేసి చొప్పున, చండీగఢ్, బీహార్, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అయితే ఈ 26 మంది అభ్యర్థులు బాలురే. అందులో 24 మంది జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు. తెలంగాణ విద్యార్థి మంథా శివ కామేశ్ 7వ ర్యాంకు, సాయి రిత్విక్‌రెడ్డి వెంకట్‌రెడ్డి 14వ ర్యాంకు, వివాన్ శరద్ మహేశ్వరి 19వ ర్యాంకు, డీ భవితేశ్‌రెడ్డి 24వ ర్యాంకుతో అదరగొట్టారు. ఇక రిషి ప్రేమ్‌నాథ్ వంద పర్సంటైల్ మార్కులు సొంతం చేసుకున్నాడు. ఇక క్యాటగిరీ వారిరీగా ఆలిండియా 14వ ర్యాంకర్ సాయి రిత్విక్‌రెడ్డి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఆలిండియా టాపర్‌గాను నిలిచాడు. రాష్ర్టానికి చెందిన ఆస్నా మల్లవరపు బాలికల క్యాటగిరీలో ఆలిండియా టాప్ ర్యాంకును కైవసం చేసుకున్నారు.
జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాల్లో తప్పుల మీద తప్పులు బయటపడుతున్నాయి. సెషన్-2 పరీక్షలో 7 ప్రశ్నలకు సమాధానాలు మార్చారు. ఏప్రిల్ 4న నిర్వహించిన పరీక్షలో ఒక ప్రశ్నను ఉపసంహరించారు. వీటిలో అత్యధికంగా ఫిజిక్స్ ప్రశ్నలే ఉండటం గమనార్హం. సెషన్-1లోను ఫిజిక్స్‌లోనే తప్పిదాలు దొర్లాయి. సెషన్-1లో 15 కీ మార్పులుండగా, 9 ప్రశ్నలను ఉపసంహరించారు. అయితే సెషన్ -2 కీ మార్పులు కొంత తక్కువగా ఉన్నాయి.
జేఈఈ మెయిన్ -1, జేఈఈ మెయిన్-2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని జాతీయ ర్యాంకులు కేటాయించారు. ఈ పరీక్షల్లో రాణించిన టాప్ 2.5లక్షల మం ది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 17న జరుగనుంది. ఇందుకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 23 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులు మే 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మా కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటుంది. నాన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తారు. వంద పర్సంటైల్ రావడం సంతోషం. ఐఐటీలో చదవాలని టార్గెట్‌గా పెట్టుకుని చదివా. రోజుకు 10 గంటలు చదివేవాడిని. అదేపనిగా చదవకుండా మధ్యలో బ్రేక్ తీసుకుని, చదివేవాడిని. స్పోర్ట్స్ ఆడుతూ టేబుల్ టెన్నిస్ ఆడుతూ సేద తీరేవాడిని. ఐఐటీ బాంబే, మద్రాస్‌లో చేరుతా. కంప్యూటర్ సైన్స్ కోర్సు తీసుకుంటా.
జేఈఈ కోసం రెండేండ్ల నుంచి శ్రమిస్తున్నాం. ఎట్టకేలకు 100 పర్సంటైల్ స్కోర్ పొందడం ద్వారా నా కల నిజమైంది. ప్రిపరేషన్ కోసం కాలేజీ అధ్యాపకుల సూచనలు, మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. సోషల్ మీడియా జోలికెళ్లకుండా కష్టపడ్డా. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కుటుంబంతో గడిపేవాడిని. కొంత సమయం ఆరు బయట గడపడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకున్నా. ఆటలాడే వాడిని.
జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు డబుల్ రికార్డు సాధించినట్టు విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన ఒక ప్రకటనలో తెలిపారు. ఇద్దరు విద్యార్థులు 300లకు 300 మార్కులు సాధించినట్టు వెల్లడించారు. బీవీసీ శేఖర్‌రెడ్డి, పసల మోహిత్ ఆలిండియా మొదటి ర్యాంకు, అరుష్ సింఘాల్ 8వ ర్యాంకు, యశ్వర్ధన్రెడ్డి 11, జేఆర్ మణిదీప్‌రెడ్డి 15వ ర్యాంకు సాధించినట్టు వెల్లడించారు. ఇక ఓపెన్ క్యాటగిరీలో రెండు మొదటి ర్యాంకులు శ్రీచైతన్యవేనని తెలిపారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో టాప్ 10, టాప్ 100, టాప్ వెయ్యిలోపు అత్యధిక ర్యాంకులను తమ విద్యార్థులే కైవసం చేసుకున్నారని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులను సుష్మ ప్రత్యేకంగా అభినందించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్స్-2026 ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్‌లు సాధించారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియా స్థాయిలో ఇద్దరికి మొదటి ర్యాంక్‌లు వచ్చినట్టు స్కూల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. తమ పాఠశాలలో చదివిన పీ మోహిత్, బీ చంద్రశేఖర్‌రెడ్డి మొదటి ర్యాంక్‌లు పొందటంతోపాటు ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో ఎం రామసంతోష్ 62వ ర్యాంక్, పీ చెన్నకేశవ్ 83వ ర్యాంక్ సాధించినట్టు వెల్లడించింది. వీరితోపాటు స్కూల్ పూర్వ విద్యార్థులు వివిధ క్యాటగిరీల్లో ఆలిండియా మొదటి 100లోపు 1, 1, 7, 8, 23, 24, 26, 34, 50, 62, 68, 71, 82, 83, 94 ర్యాంక్‌లు సాధించినట్టు వివరించింది. ఉత్తమ ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.