హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో భోజనం కలుషితం కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెలలో ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటన చోటు చేసుకుంటున్నది. నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడం సంచలనంగా మారింది. ఇది మరువక ముందే కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి పాఠశాలలో ఆహారం కలుషితమైన ఘటన వెలుగుచూసింది. పర్యవేక్షణను గాలికొదిలేసిన ప్రభుత్వ పెద్దలు, నిర్లక్ష్యం వీడని అధికారులు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం ప్రక్షాళన అవసరం అని ఉపాధ్యాయ నేతలు, నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధ్యాయ నేతలు, నిపుణుల సూచనలు
మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగుపర్చాలి. అన్ని విద్యాసంస్థలకు కామన్ మెనూను అమలు చేయాలి. గురుకుల విద్యార్థులకు భోజనంతో పాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్, టీ ఇస్తున్నారు. వీటిని ఇతర స్కూళ్లలోనూ అందించాలి. టీచర్లను బోధనేతర విధులను వినియోగించకూడదని విద్యాహక్కు చట్టం స్పష్టంచేసింది. ఫుడ్ పాయిజన్ ఘటనలకు టీచర్లు, హెచ్ఎంలను బాధ్యుతలను చేయడం భావ్యం కాదు.
– రాజభాను చంద్రప్రకాశ్, రాష్ట్ర హెచ్ఎం అసోసియేషన్ అధ్యక్షుడు