హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్సెట్) షెడ్యూల్ ఖరారైంది. శనివారం షెడ్యూల్ను సెట్ సభ్యకార్యదర్శి మురళీకృష్ణ విడుదల చేశారు. రాష్ట్ర వర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత కల్పించే ఈ పరీక్షను సీబీటీ పద్ధతిలో అక్టోబర్లో నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ ఉత్తీర్ణులైన వారు, పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు పరీక్ష రాసేందుకు అర్హులు. మొత్తం 29 సబ్జెక్టుల్లో సెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
పేపర్ -1ను 50 ప్రశ్నలకు నిర్వహించనుండగా, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 100 మార్కులుంటాయి. పేపర్ -2లో 100 ప్రశ్నలుండగా, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 3గంటల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఓసీలు 40 శాతం, రిజర్వేషన్ క్యాటగిరీలో 35 శాతం మార్కులు పొందితే క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. వివరాలకు www.telanganaset.org, www.osmania.ac.in వెబ్సైట్లను సంప్రదించాలని మురళీకృష్ణ సూచించారు.