హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు సంబంధించి అక్టోబర్ 8 నుంచి 28వరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తుల గడువు ముగిసి 20 రోజులు కావొస్తున్నా ఎంతమంది దరఖాస్తు చేశారనే విషయాన్ని అటు ఆర్టీసీ గానీ, ఇటు పోలీస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుగానీ నేటికీ వెల్లడించకపోవడం చర్చనీయాంశమైంది. గతంలో ఏ నోటిఫికేషన్ విడుదలైనా దరఖాస్తు తేదీ ముగిసిన వెంటనే ఆయా పోస్టులకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వారిలో అర్హులు ఎంతమంది? అని వెంటనే వెల్లడించేవారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు దొడ్దిదారిన డబ్బులు పెట్టి పోస్టులు సంపాదించారనే ఆరోపణలు గుప్పుమనడంతో.. డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు పోస్టులు దక్కాతాయో? లేదో? అనే ఆందోళనలో పడ్డారు.
ఆర్టీసీలో ఇటీవల విడుదలైన మొత్తం 1,743 పోస్టులకు సుమారు 40వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో డ్రైవర్ పోస్టులకు సుమారు 28,900పైనే దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. ఇక శ్రామిక పోస్టులకు కూడా అదేస్థాయిలో దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఈ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉన్నది. దరఖాస్తుల వివరాల విషయమై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఆర్టీసీ అధికారులను ‘నమస్తే తెలంగాణ’ కోరగా.. త్వరలోనే వెల్లడిస్తామంటూ దాటవేశారు. ప్రభుత్వ పెద్దలు ఈ పోస్టులు అమ్ముకునేందుకు సిద్ధమయ్యారనే ఆరోపణలపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉన్నది.