హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీ నాడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గమ్యం యాప్’ నిర్వహణ అగమ్యగోచరంగా తయారైంది. నిర్వహణను నేటి ఎండీ, సాంకేతిక సిబ్బంది గాలికొదిలేయడంతో ఈ యాప్ వాడుతున్న ఎంతోమంది సాంకేతిక సమస్యలతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో తిరిగే పుష్పక్, మెట్రో, ఆర్డినరీ బస్సులతోపాటు దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, జిల్లాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులను కూడా గమ్యం యాప్ ద్వారా ట్రాకింగ్ చేసుకునే సదుపాయాన్ని నాటి కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు తాము ఎంపిక చేసుకున్న బస్సు ఎకడుందో, ఎంతసేపట్లో బస్.. స్టేషన్‌కు చేరుకుంటుందో తదితర వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతోపాటు గమ్యం మొబైల్ యాప్‌లో బస్సు నడిపే డ్రైవర్, కండక్టర్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. కానీ యాప్ నిర్వహణను ఆర్టీసీ పట్టించుకోకపోవడంతో తాము ప్రయాణించాలనుకునే బస్ ఎక్కడుందో తెలియక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
టీజీఎస్ ఆర్టీసీ యాప్‌లో బస్సు ఒక చోట ఉన్నట్లు చూపిస్తుంటే, నిజానికి అది మరో చోట ఉండటం లేదా అప్పటికే ఆ స్టాప్ దాటి వెళ్లిపోవడం తదితర సమస్యలను నిత్యం ఎంతో మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో యాప్ ఓపెన్ చేయగానే కొన్ని రూట్లకు సంబంధించిన బస్సుల సమాచారం అస్సలు కనిపించడం లేదు. ట్రాఫిక్ జామ్‌లు, ఇతర కారణాలతో బస్ ఆలస్యమైనప్పుడు, యాప్‌లో చూపే ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ అరైవల్(ఈటీఏ) ఆటోమేటిక్‌గా అప్డేట్ కావడం లేదు. పాత సమయాన్నే చూపించడం వల్ల ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ యాప్‌ను సుమారు 50లక్షల మందిదాకా వినియోగిస్తుండడం.. వీరు నిత్యం ప్రయాణాలు చేసే వారు కావడంతో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.
ఇటీవల కాంగ్రెస్ ‘మీ టికెట్’ యాప్‌లో జర్నలిస్టులను పూర్తిగా మరచిపోయింది. ఈ మీ టికెట్ యాప్ ద్వారా మెట్రో, టీజీఎస్ ఆర్టీసీ, పార్క్స్, టెంపుల్స్, జూపార్క్, బోటింగ్, జీహెచ్ఎంసీ హాల్స్, వాటర్‌ఫాల్స్, ఫోర్ట్స్ అండ్ మ్యూజియమ్స్ తదితర వాటికి ముందుగానే టికెట్ల్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆర్టీసీ విభాగంలో ‘బుక్ బస్ టికెట్స్’ విభాగంలో రాష్ట్రంలో ఎక్కడ్నుంచి ఎక్కడికైనా టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కానీ ఇందులో జర్నలిస్టులకు వర్తించే 1/3 రాయితీని పూర్తిగా విస్మరించారు.