హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): గురుకుల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) అధికారులు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు వెంటనే తమ టెట్ మారులను అప్లోడ్ చేయాలని ట్రిబ్ ఈ నెల 20 ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలోనే అంటే 21 సాయంత్రం 5 గంటల్లోగా మారులు అప్లోడ్ చేయాలని సూచించింది.
లక్షమందికిపైగా ఒక్కరోజు వ్యవధిలోనే మార్కులను అప్లోడ్ చేయాలని ఆదేశించడం గమనార్హం. అప్లోడ్ చేయబోతే సైట్ మొరాయించింది. హెల్ప్‌లైన్ లైన్‌నూ స్పందించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురై మాసబ్‌ట్యాంక్‌లోని ట్రిబ్ కార్యాలయానికి పరుగెత్తారు. అప్పుడుగానీ అధికారులు స్పందించలేదు. టెట్ మార్కుల అప్లోడ్ చేసే గడువును ఒక్కరోజు.. అంటే 22 సాయంత్రానికి పొడిగించారు.
ట్రిబ్ వ్యవహారంపై గురుకుల అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది మొదలు ఇదే రీతిన వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తుతున్నారు. డిసెండింగ్ ఆర్డర్లో పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా భర్తీ ప్రక్రియను ఆగమేఘాల మీద చేపట్టిందని ఆరోపించారు. డీఎల్, జేఎల్ పోస్టుల మెరిట్ జాబితాలను సైతం అదేరీతిన అర్ధరాత్రి విడుదల చేసి, రెండురోజుల వ్యవధిలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టింది. ఇప్పుడు ఒక్కరోజులోనే టెట్ మార్కుల ఆప్‌లోడ్ అంటూ ఆదేశించిందని భగ్గుమంటున్నారు.
పది రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. 11 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలను పంపించింది. ప్రభుత్వ ఆమోదం రాగానే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నది.