Pre Launch | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): అందమైన బ్రోచర్లు.. అ బ్బురపరిచే గ్రాఫిక్స్.. నిన్నటిదాకా ప్రీలాంచ్ అమ్మకాలకు ఇవే పునాదులు. ఇప్పుడు ప్రీ లాంచ్ దందా వింత పోకడలు పోతున్నది. బ్రోచర్లు లేవు.. గ్రాఫిక్స్ అసలే లేవు.. కనీసం ప్రాజెక్టు పేరు కూడా ఉండదు. బహిరంగ ప్ర చారమే కనిపించదు. కేవలం భూమి డాక్యుమెంట్ ఉంటుంది. అందమైన భవనాలు కడతామంటూ కేవలం ఫోన్లలోనే మార్కెటింగ్ జరుగుతుంది. రూ.కోట్లల్లో వ్యాపారం అవుతుంది. ఇదీ తాజాగా వెలుగులోకొచ్చిన నయా ప్రీలాంచ్ దందా. ఇప్పటికే తరచూ ప్రీలాంచ్ మోసాలతో అనేక నిర్మాణ సంస్థలు బోర్డులు తిప్పేసి కోట్లాది రూపాయలు కొల్లడొడుతున్న తరుణంలో నోటి మాటలతోనే ఆకాశహర్మ్యాలు నిర్మిస్తూ కోట్లు వసూలు చేస్తున్న బెంగళూరుకు చెందిన సొనెస్టా ఇన్ఫ్రా వ్యవహారం తాజాగా బయటికొచ్చింది. రెరా రెండురోజుల క్రితం గచ్చిబౌలిలోని ఆసంస్థతోపాటు కడ్తాల్‌లోని హస్తిన రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
బెంగళూరు చెందిన సొనెస్టా ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్ శివారు ప్రాంతమైన మోకిలలో సొనెల్టా ఇన్ఫిటీ పేరుతో అపార్ట్మెంట్ ప్రాజెక్టు చేపడుతున్నామని మార్కెటింగ్ మొదలుపెట్టింది. గతానికి భిన్నంగా వ్యాపారం మొదలుపెట్టింది. మోకిలలో కేవలం ఐదెకరాల భూమి డాక్యుమెంట్లు మాత్రమే వారి వద్ద ఉన్నాయి. ప్రాజెక్టుకు పేరు పెట్టలేదు.. అనుమతుల కోసం ఒక్క డాక్యుమెంటు కూడా తయారు చేయలేదు. కేవలం గచ్చిబౌలిలో జయభేరి వ్యాలీ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో కార్యాలయాన్ని తెరిచారు. ముగ్గురే ఉద్యోగులు. అక్కడి నుంచి ఫోన్ల ద్వారా మార్కెటింగ్ మొదలుపెట్టారు. హెచ్ఎండీఏ, రెరా నుంచి అనుమతులే లేవు. కనీసం వాటికి బీజం కూడా వేయలేదు. ఫ్లాట్లను బుక్ చేసుకోవాలంటూ ఆశ చూపుతూ కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో వీళ్లు ఫోన్ చేసిన వారిలోనే ఒకరు ఈ మోసాన్ని గుర్తించి రెరాకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది. దీంతో రెరా వెంటనే స్పందించి సదరు సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రెరా చట్టం ప్రకారం మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో సంజాయిషీ ఇవ్వాలంటూ వారంపాటు గడువు ఇచ్చింది. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ సొనెస్టా ఇన్ఫ్రా ప్రతినిధి శ్యామ్‌ని సంప్రదించింది. అనుమతుల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నదని, తమకు తెలిసిన వారికే ప్రాజెక్టు గురించి చెప్పామని, ఎలాంటి ప్రచారం చేయలేదని వివరణ ఇచ్చారు.
నగరంలోనే కాదు.. శివారులోనూ వివిధ నిర్మాణ సంస్థలు మరో రకంగా టోకరా వేస్తూ నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. కడ్తాల్‌లో హస్తిన రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బ్రిసా పేరుతో ఏర్పాటుచేసిన లేఅవుట్లో ఖాళీ స్థలాలను విక్రయిస్తున్నది. ఈ లేఅవుట్ అనుమతి ఒక కంపెనీ పేరున ఉంటే, అమ్మకాలను మరో కంపెనీ చేస్తున్నది. దీనికి తోడు లేఅవుట్ నంబర్ (ఎల్పీ) వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు వివరాలను రెరాలో నమోదు చేయలేదని ఫిర్యాదులు రావడంతో రెరా అధికారులు ఆ సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల పదుల సంఖ్యలోనే రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీలాంచింగ్ ఆఫర్లతో అమ్మకాలు చేస్తూనే ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్రీ లాంచ్ ఆఫర్లు ప్రకటించి మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటివరకు ఒకేసారి 58 కేసులు నమోదయ్యాయి. ఇటీవలే సాయి నిఖిత, భువనతేజ, ఈవీ కే ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. తక్కువ ధర ఆశ చూసి ఫ్రీ లాంచ్ ఆఫర్లలోకి వెళ్లి ఎందరో మోసపోతున్నారు. దీంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఫ్రీ లాంచ్ ఆఫర్లు చట్టవిరుద్దమైనా పట్టించుకునే వారు లేరు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నిద్రావస్థలో ఉన్నాయి. కేవలం సాహితీ ఇన్ఫ్రాలోనే సుమారు 2,500 మంది బాధితుల నుంచి వివిధ వెంచర్ల పేరుతో రూ.3 వేల కోట్ల వరకు సంస్థ నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణ వసూలు చేసినట్టు కేసు నమోదైంది.