హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జైళ్లశాఖలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం, భద్రతా లోపాల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నామని జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా తెలిపారు. ఈ విషయాల్లో బాధ్యులుగా తేలిన వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరణ ఇచ్చారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిలో ఆగస్టు 31న ప్రచురితమైన ‘16 మంది ఖైదీలకు ఓ సూపరింటెండెంట్.. 640 మంది ఉన్నచోట నో’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి జైళ్లశాఖ తరఫున వివరణ ఇచ్చారు. వరంగల్ సెంట్రల్ జైలు భవనాన్ని కూల్చివేసిన అనంతరం, దానిని తాతాలికంగా ఓపెన్ ఎయిర్ జైలుగా మార్చినట్టు తెలిపారు. అకడ ఉన్న మిగిలిన ఖైదీలను సమీపంలోని ఇతర జైళ్లకు తరలించామని చెప్పారు. జైలు భవన నిర్మాణం పూర్తయిన అనంతరం వరంగల్ సెంట్రల్ జైలుకు ఖైదీలను తరలిస్తామని స్పష్టత ఇచ్చారు.
వరంగల్ సెంట్రల్ జైలుకు మంజూరైన సిబ్బంది అవసరాలను బట్టి రొటేషన్ పద్ధతిలో సెంట్రల్ ప్రిజన్ నిజామాబాద్, సెంట్రల్ ప్రిజన్ సంగారెడ్డి, సికా శిక్షణ సంస్థ, శాంతిభద్రతల బందోబస్తు, ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా, పెట్రోల్ బంకుల నిర్వహణ, పామాయిల్ నర్సరీ, గొర్రెల పెంపకం, కూరగాయల సాగు, ఫినాయిల్ తయారీ యూనిట్ వంటి ఖైదీల పునరావాస కార్యక్రమాల్లో కూడా సిబ్బంది సేవలు అందిస్తున్నారని చెప్పారు. వరంగల్ జైలు సిబ్బందిలో కొంత భాగాన్ని నిజామాబాద్, సంగారెడ్డి జైళ్లకు శాశ్వతంగా బదిలీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపామని ఆమె స్పష్టత ఇచ్చారు. ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించిన అనంతరం ప్రస్తుతం అమల్లో ఉన్న రొటేషన్ విధానానికి బదులుగా ఆయా జైళ్లకు శాశ్వత సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు.
నిజామాబాద్ సెంట్రల్ జైలు రెగ్యులర్ సూపరింటెండెంట్ ప్రస్తుతం శాఖాపరమైన విచారణను ఎదురొంటున్నారని చెప్పారు. జైలులో జరిగిన ఘటనను జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గుర్తించి, సదరు ఖైదీని వైద్య పరీక్షల అనంతరం కామారెడ్డి సబ్‌జైలుకు బదిలీ చేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో బాధ్యులపై విచారణ కొనసాగుతుందని చెప్పారు. ఇక 2వేల మంది ఖైదీలు ఉన్న చర్లపల్లి సెంట్రల్‌జైలులో ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఖైదీల సంఖ్యకు అనుగుణంగా ఒక నిర్దిష్ట హోదాకు చెందిన అధికారుల సంఖ్య తప్పనిసరిగా ఉండాలనే అభిప్రాయం కారాగార పరిపాలనా విధానంలో ఉన్నదని తెలిపారు.