హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు పంపిణీ సంస్థలైన డిస్కంలు దివాలా దిశలో పయనిస్తున్నాయి. అప్పుల్లో కూరుకుపోతున్నాయి. టీజీ జెన్కో, ట్రాన్స్కో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ డిస్కంలు రూ.59,230 కోట్ల అప్పుల్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరక ముందు డిస్కంల అప్పులు రూ.35,239 కోట్లు మాత్రమే ఉండేవి. 2023-24లో ఈ అప్పు రూ.46,127 కోట్లకు చేరింది. 2024-25లో రూ.59,230 కోట్లకు పెరిగింది. దేశంలో అధిక అప్పులున్న డిస్కంల్లో తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నది. అత్యధిక అప్పులున్న రాష్ర్టాల్లో తమిళనాడు టాప్లో ఉండగా, ఆ తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీ, యూపీ వంటి రాష్ర్టాలున్నాయి. వీటి తర్వాత తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నది.
27 వేల కోట్ల కొత్త అప్పు
రాష్ట్రంలో విద్యుత్తు సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నది. కానీ, గత రెండేండ్లలో అప్పుల భారం మ రింత పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అప్పులు అమాంతం పెరిగిపోయాయి. 2024-25లో రూ.59,230 కోట్లగా ఉన్న అప్పు.. 2025 మార్చి 31 నాటికి రూ.59,671కోట్లు, 2025 జూలై 31 నాటికి రూ.62,897 కోట్లకు చేరింది. అంటే ఈ రెం డేండ్లల్లోనే డిస్కంల అప్పులు రూ. 27,658 కోట్లు పెరిగాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలు రూ.48 వేల కోట్లు కూడా డిస్కంల పాలిట గుదిబండలా మారాయి. అప్పులతోపాటు రావాల్సిన బకాయిలు కూడా పెరుగుతుండటంతో డిస్కంలు సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకుంటున్నాయి. విద్యుత్తు సబ్సిడీ తప్ప ప్రభుత్వం ఇతరత్రా నిధులను సమకూర్చడంలేదు. దీంతో డిస్కంలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
నడ్డి విరుస్తున్న నష్టాలు
ఏటేటా నష్టాలు పెరుగుతుండటంలో డిస్కంలు కుదేలవుతున్నాయి. ఒక్క గుజరాత్ తప్ప మరే రాష్ట్ర డిస్కంలు లాభాల్లో నడవడంలేదు. గుజరాత్ డిస్కంలు రూ.7,355 కోట్ల మిగులుతో నడుస్తున్నాయి. ఏపీలో డిస్కంల నష్టాలు నిరుడు రూ.29వేల కోట్లు కాగా, ఈ ఏడాదికి రూ.19 వేల కోట్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద రాష్ర్టాలైన కర్ణాటక రూ.34 వేల కోట్లు, కేరళ రూ.38 వేల కోట్లు, మధ్యప్రదేశ్ రూ.71 వేల కోట్లు, మహారాష్ట్ర రూ.35 వేల కోట్లు, రాజస్థాన్ రూ.90 వేల కో ట్లు, తమిళనాడు రూ.1.67 లక్షల కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ.లక్ష కోట్ల నష్టాలతో నడుస్తున్నాయి. తెలంగాణలోనూ ఏటేటా పెరుగుతున్న డిస్కంల నష్టాలు 2024-25లో రూ. 69,741 కోట్లకు చేరాయి.
2024-25లో విద్యుత్తు సంస్థల అప్పుల్లో అగ్రభాగంలో ఉన్న రాష్ర్టాలు రాష్ట్రం అప్పులు (కోట్లలో)
(2025 జూలై 31 నాటికి రూ.62,897 కోట్లు)