Godavari | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు రూ.80వేల కోట్లతో చేపట్టనున్న గోదావరి-బనకచర్ల(జీబీ) లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా కదలకపోవడం పై నీటిపారుదలరంగ నిపుణుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరునెలలుగా జీబీ లింక్‌పై కదలికలు ఉన్నప్పటికీ.. నెలరోజులుగా ఏపీ చూపుతున్న దూకుడు, దానికి కేంద్రం సహకరిస్తున్నదన్న సంకేతాలు స్పష్టమవుతూనే ఉన్నాయి. తెలంగాణ జలహక్కులకు భంగం కలిగే ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది. అది నిర్లక్ష్యమా? నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అవగాహన రాహిత్యమా? లేక ఏపీ పాలకులకు పరోక్షంగా సహకరించేలా సాగుతున్న కుమ్మక్కు రాజకీయమా? అనే సందేహాలు అటు తెలంగాణవాదుల నుంచీ ఇటు ఇరిగేషన్ నిపుణుల నుంచీ వ్యక్తమవుతున్నాయి. జీబీ లింక్‌పై కేంద్రం-ఏపీ మధ్య వరుస సమావేశాలు, కేంద్రానికి అందించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు, కేంద్రం అందిస్తున్న నిధుల సాయం, ఢిల్లీ వేదికగా సీఎం చంద్రబాబే బనకచర్లపై స్పష్టత ఇవ్వడం వంటి పరిణామాల తర్వాత కూడా రేవంత్ సర్కారు కిమ్మనడం లేదు.
తెలంగాణకు తీరని నష్టం కలిగించే ప్రాజెక్టు విషయంలో ఇంతవరకు ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ స్పందనారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. సీఎం రేవంత్ సైతం జీబీ-లింక్‌పై నోరు మెదపకపోవడం, క్యాబినెట్లో చర్చిస్తామని హడావుడి చేసి చివరకు ఎజెండా నుంచే తొలగించడం అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ప్రాజెక్టును వ్యతిరేకిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ పైకి చెప్తున్నా.. ప్రభుత్వం వైపునుంచి చిత్తశుద్ధి ఎక్కడా కనిపించడంలేదు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కొల్లగొట్టి బనకచర్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ఎలా చేపడుతున్నదో, దానికి కేంద్రం ఎలా వత్తాసు పలుకుతున్నదో ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురిస్తూ వచ్చింది. తెలంగాణ నీటి హక్కులను ప్రమాదంలో పడేసే ఈ ప్రాజెక్టు వెనుక జరుగుతున్న రాజకీయ క్రీనీడను కూడా కండ్లకు కడుతూవచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు పక్షం రోజులక్రితం ఢిల్లీలో మీడియా సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్న మాట నిజమేనని, కేంద్రం సం పూర్ణ సహకారం అందిస్తున్నదని కుండబద్దలుకొట్టారు.
దాంతో నమస్తే తెలంగాణ కథనాల ను పరోక్షంగా ఆయన అంగీకరించినట్టయ్యిం ది. మరోవైపు ప్రధాని మోదీ సైతం పోలవరం పునర్నిర్మాణం, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ను వేగవంతంపై సమీక్షలు నిర్వహించారని, త్వరగా నిర్మాణం పూర్తికి ఆదేశాలిచ్చారంటూ వార్తలు వచ్చాయి. ఇంత హడావుడి జరుగుతున్నా.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న ది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా జనవరిలో స్పష్టత కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం.. గడిచిన ఐదు నెలల్లో ఆ దిశగా మరే చర్యా తీసుకోకపోవడం విమర్శలపాలవుతున్నది. తీరా ఇప్పుడు జీబీ లింక్ ప్రాజెక్టు ఏపీకి గేమ్‌చేంజర్ అంటూ చంద్రబాబు బాహాటంగానే చెప్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మా త్రం జనవరిలో రాసిన తమ లేఖకు కేంద్రం నుంచి ఇటీవల వచ్చిన జవాబును చూపెడుతూ కాలయాపన చేస్తున్నది. జీబీ లింక్‌పై తమవద్ద ప్రతిపాదన ఏదీ రాలేదని కేంద్ర జల్‌శక్తి, అర్థికశాఖలు చెప్పాయని మంత్రి ఉత్తమ్ అంటున్నారు. కేంద్రం చెప్పడం సరే.. జీబీ లింక్‌పై జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మౌనంగా ఉంటున్నదా అనే అనుమానాలున్నాయి.
పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలోతొక్కుతూ ఏపీ ప్రభుత్వం గోదావ రి- బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు దూకుడుగా ముందుకుసాగుతున్నది. 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు సిద్ధమైంది. రూ.80,112 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులకు కావాల్సిన నిధుల సమీకరణకు ‘జలహారతి’ పేరిట కార్పొరేషన్‌ను సైతం ఏర్పాటు చేసింది. అంతేకాదు జీబీ లింక్ ప్రాజెక్టులో భాగంగా పల్నాడు జిల్లా లో బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధంచేసింది. రిజర్వాయర్‌కు సంబంధించి పల్నాడు జిల్లాలో 15 ముంపు గ్రామాల్లో సర్వే చేయించింది. పెన్నా బేసిన్లో కాల్వలను వెడల్పు చేసే పనులను నిర్వహిస్తున్నది. జీబీ లింక్ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ రిపోర్ట్‌ను గత 23వ తేదీనే కేంద్రానికి సమర్పించింది. అతిత్వరలోనే డీపీఆర్ సమర్పించేందుకూ ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
ఏపీ చేపడుతున్న జీబీ లింక్ ప్రాజెక్టుకు కేంద్రం సైతం వత్తాసు పలుకుతున్నది. ఏపీ ప్రభుత్వం జీబీ లింక్ ప్రాజెక్టును తెరమీదకు తీసుకురాగా.. అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ గత జనవరిలో తెలంగాణ సర్కారు లేఖ రా సింది. కానీ వాటిని పట్టించుకోకుండా ఏపీకి మాత్రం కేంద్రం స్పష్టమైన హామీని ఇచ్చినట్టే కనిపిస్తున్నది. జీబీ లింక్ ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రిని కోరగా.. ఆర్థికమంత్రి వినతిపై కేంద్ర జల్‌శక్తిశాఖ సైతం ప్రాజెక్టుపై వేగంగా స్పందించింది. జీఆర్ఎంబీ మాత్రం కనీసం ఆ లేఖ సమాచారాన్ని తెలంగాణకు ఇవ్వలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే సీఎం బాబు ఢిల్లీకి వెళ్లి ప్రధానితోపాటు, కేంద్రమంత్రులను కలిసి ఆర్థికసాయం అందించాలని విన్నవించారు. వారు సానుకూలత వ్యక్తంచేశారని చంద్రబాబే మీడి యా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. ఏపీ కి అన్నివిధాలా మద్దతు తెలుపుతున్న కేంద్రం తెలంగాణను మాత్రం మభ్యపెడుతున్నది.
కేంద్రం హామీ లభించడంతో ఏపీ ప్రభు త్వం జీబీ లింక్‌పై దూకుడుగా ముందుకుపోతున్నది. జీబీ లింక్ ప్రాజెక్టుకు నెలాఖరున రూ.20వేల కోట్లతో టెండర్లను పిలిచేందుకు సిద్ధం చేయాలని ఏపీ సీఎం ఆ శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. తొలిదశలో భాగంగా పోలవరం లింక్ పాయింట్ నుంచి నాగార్జునసాగర్ కుడి కాల్వ లింకింగ్ పనులకు రూ.20 వేల కోట్లతో టెండర్లను సిద్ధం చేయాలని సూ చించినట్టు తెలిపింది. అలాగే ఎన్‌డబ్ల్యూడీఏ టాస్‌ఫోర్స్ కమిటీ మీటింగ్, కన్సల్టెన్సీ మీటింగ్‌లను నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నదని తెలిసిపోతున్నది.
బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఓవైపు డీపీఆర్ సిద్ధం చేసి, టెండర్లు పిలిచే పనిలో బిజీగా ఉంటే.. మరోవైపు ఆ ప్రాజెక్టు ఇంకా ప్రపోజల్ దశ కూడా దాటలేదని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తున్నారు. జీబీ లింక్‌పై తమకే ప్రతిపాదనలు రాలేదని కేంద్రం తనకు రాసిన లేఖను అందుకు ఆధారంగా చూపుతున్నారు. అదే నిజమైతే.. మరి ఏపీ సర్కారు ఇప్పటికే ఎఫ్పీఆర్ను సమర్పించి, డీపీఆర్‌ను అందించడం అబద్ధమా? ‘జలహారతి’ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఉత్తదేనా? బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలుపడంతోపాటు ఆర్థికంగా సహకారం అందించేందుకు సమ్మతించిందని చంద్రబాబు ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించడం అబద్ధమా? పెన్నా బేసిన్లో కాలువల సామర్థ్యం పెంచేందుకు ఆగమేఘాలపై సాగుతున్న పనులు అబద్ధమా? ఒకవైపు హడావుడిగా పనులు సాగుతుంటే, కండ్లముందు అందుకు సాక్ష్యాలు కనబడుతుంటే.. రేవంత్ సర్కారు మాత్రం ‘అదంతా మిథ్య’ అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నది? తెలంగాణ జల ప్రయోజనాలు దెబ్బతీసే ప్రాజెక్టుపై ఎందుకింత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది? నీటిపారుదలరంగంపై అవగాహన లోపమా? సమస్యపై పట్టింపులేని ధోరణా? లేక ఏపీ సర్కారుతో కలిసి సాగిస్తున్న ‘ఆల్ ఈజ్ వెల్’ తరహా కుమ్మక్కు రాజకీయమా? ఇదే ప్రశ్నల్ని తెలంగాణవాదులు, నీటిపారుదలరంగ నిపుణులు లేవనెత్తుతున్నారు.
తెలంగాణ జలహక్కులకు తీరని ముప్పు పొంచి ఉన్న తరుణంలో జీబీ లింక్‌పై ఇప్పటివరకు రేవంత్ ప్రభుత్వం నోరు మెదపలేదు. విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి ఉత్తమ్ జీబీ లింక్‌పై బలహీన వాదనను వినిపించే ప్రయ త్నం చేశారు. ఏపీ, కేంద్రం ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకుపోతున్న తీరు కళ్లకు కట్టినట్టు గా కనబడుతున్నా, బాహాటంగానే అన్నీ ప్రకటిస్తున్నా మంత్రి మాత్రం కేంద్రంపై తమకు విశ్వాసమున్నదని, ప్రాజెక్టుపై ముందుకుపోరని నమ్ముతున్నామంటూ పేర్కొనడం గమనార్హం. జీబీ-లింక్‌పై ఎందుకు ఘాటుగా స్పందించలేదని, కనీసం కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదని పలువురు నీటిపారుదలరంగ నిపుణులు, రిటైర్డు ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం చెప్పే మాయమాటలు వినకుండా.. తెలంగాణ జలహక్కుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఇరిగేషన్రంగ నిపుణులు సూచిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం రూ.80 వేల కోట్లతో చేపడుతున్న గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ దిశగా మేము వర్కవుట్ చేస్తున్నాం. రూ.80 వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం ఖర్చు కేంద్రమే భరించాలని మేం చెప్పడం లేదు. కేంద్రం, ఏపీ కలిసి హ్యామ్ మోడల్లో పనులను చేపట్టేందుకు ఆమోదం తెలుపాలని కోరాం. 200 టీఎంసీల మిగులు జలాలను గోదావరి నుంచి తీసుకెళ్లే జీబీ లింక్ ఏపీకి ఇదో గేమ్‌చేంజర్!
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న జీబీ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి తమ వద్దకు ప్రతిపాదనలేవీ రాలేదని కేంద్ర జల్‌శక్తి శాఖ రాష్ర్టానికి లేఖరాసింది. ఐదు నెలలక్రితం మేం రాసిన లేఖలకు కేంద్ర జలశక్తిశాఖ, ఆర్థికశాఖ ఇటీవల జవాబిచ్చాయి. మనం కేంద్రప్రభుత్వాన్ని విశ్వసించాలి. ఏపీ చర్యలను కేంద్రం నిలువరిస్తుందని ఆశిస్తున్నం. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి మేం అలర్ట్‌గానే ఉన్నాం. దాని గురించి అధ్యయనం చేస్తున్నం. తగిన సమయంలో స్పందిస్తాం.
ఏపీ ప్రభుత్వం ఇంట్రా స్టేట్ రివర్ లింక్ ప్రాజెక్టు పేరిట ఇంటర్ స్టేట్ లింకింగ్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. గోదావరి- బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు మాటున కావేరికి సైతం జలాలను తరలించేందుకు వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నది. ఇదే విషయమై నమస్తే తెలంగాణ ముందునుంచీ చెప్తూ వచ్చిందే నిజమైంది. తొలుత జీబీ లింక్ ను చేపట్టి బనకచర్ల నుంచి ఆపై జలాలను సోమశిలకు, తద్వారా కావేరికి తరలించేందుకు కేంద్రం, ఏపీ గుట్టుగా కుట్రలు చేస్తున్నాయని ఇప్పటికే నమస్తే తెలంగాణ అనేక కథనాలను ప్రచురించింది. అది నిజమేనని తాజాగా కేంద్రం వేస్తున్న అడుగులు నిరూపిస్తున్నాయి. అందులో భాగంగా గోదావరి- సోమశిల- కావేరి లింక్‌ను చేపట్టే ప్రతిపాదనలనూ తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ ఈ నెల 12న కన్సల్టెన్సీ మీటింగ్‌ను హైదరాబాద్ జలసౌధలో నిర్వహించాలని నిర్ణయించింది. కానీ ఆకస్మాత్తుగా ఆ సమావేశాన్ని 24కు వాయిదా వేసింది. కానీ ఇప్పుడు కన్సల్టెన్సీ మీటింగ్ లేకుండానే ఏకంగా ఉన్నట్టుండి 12వ తేదీనే టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.