ఖాన్ అబ్దుల్గఫార్ఖాన్..
భారత స్వాతంత్య్రోద్యమం ముద్దు బిడ్డ. కత్తి తిప్పడం తప్ప మరో విద్య తెలియని పష్తూన్లను అంహిసా యోధులుగా మలిచారు. సత్యాగ్రహులుగా తీర్చిదిద్దారు. అందుకే ఆయనను ‘సరిహద్దు గాంధీ’గా పిలుస్తాం.
ఓ వైపు భారత స్వాతంత్య్ర ఉద్యమకారులు.. మరో వైపు భారతీయ సిపాయీలు.. బ్రిటిష్ అధికారి కాల్పులు జరపాలని ఆదేశించాడు.. కానీ తుపాకులు మొరాయించాయి. తూటాలు పేలలేదు. కారణం.. భారతీయ సిపాయీలు తమ సోదరులపై కాల్పులు జరిపేందుకు నిరాకరించడమే. ఈ ధిక్కారానికి వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కానీ చరిత్ర ఆ తిరగబడ్డ సిపాయీలను స్వాతంత్య్ర వీరులుగా గౌరవించింది.
1930..ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ నాయకత్వంలో పష్తో (నేడు పాకిస్తాన్లో ఉంది) ప్రాంతంలో పష్తూన్ల ఖుదాయీ ఖిద్మత్గార్ (భగవంతుని సేవకులు) చేపట్టిన విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం బ్రిటిష్ పాలకులకు నిద్రలేకుండా చేసింది. ఆ ఉద్యమాన్ని అణచేందుకు పెషావర్‌లో రాయల్ గఢ్వాల్ రైఫిల్స్ దళాలను దించారు. గఫార్ ఖాన్, అతడి ముఖ్య అనుచరులను జైళ్లలో నిర్బంధించారు. గఫార్ ఖాన్, ఇతర నాయకులను విడుదల చేయాలని ఖుదాయీ ఖిద్మత్గార్ ఉద్యమం డిమాండ్ చేసింది.
అందరిదీ అదే మాట..
ఎప్పటిలాగే, బ్రిటిష్ పాలకులు భారతీయులకు వ్యతిరేకంగా భారతీయులనే నిలబెట్టే ఎత్తులు వేశారు. పెషావర్‌లోని పఠాన్లు.. హిందువుల దుకాణాలపై దాడి చేసే ప్రమాదం ఉందని, ఉదయాన్నే పఠాన్‌లపై కాల్పులు జరిపేందుకు సిద్ధంగా ఉండాలని బ్రిటిష్ సైనికాధికారి ఏప్రిల్ 22 రాత్రి రాయల్ గఢ్వాలీ సైనికులతో అన్నాడు. ఆ అధికారి పోయిన తర్వాత, “ఏ గఢ్వాలీ అయినా బ్రిటిష్ అధికారి చెప్పినట్లు పఠాన్‌లపై కాల్పులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాడా?” అని హవల్దార్ చంద్రసింగ్ గఢ్వాలీ అడిగాడు. సాటి భారతీయులపై కా ల్పులు జరపబోమని సైనికులందరూ చెప్పా రు. పంజాబ్‌లోని జలియన్‌వాలాబాగ్, మో ప్లాలో చేసిన పొరపాట్లే మనం చేయకూడదని చంద్ర సింగ్ గఢ్వాలీ సైనికులకు సూచించాడు.
తుపాకీలు కిందపడేసినా…
తెల్లవారింది. రాయల్ గఢ్వాలీ రైఫిల్స్ దళాన్ని కెప్టెన్ రికెట్ క్విస్సా ఖ్వానీ బజార్‌కు తీసుకుపోయాడు. అక్కడ.. గఫార్ ఖాన్, ఖుదాయీ ఖిద్మత్గార్ ముఖ్య నాయకులను అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఆందోళన చేస్తున్నారు. ‘గఢ్వాలీ సైనికులారా, ఈ ఆందోళనాకారులపై మూడు రౌండ్లు కాల్పులు జరపండి’ అంటూ కెప్టెన్ రికెట్ ఆదేశించాడు. ఆ వెంటనే, ‘గఢ్వాలీ సైనికులారా, కాల్పులు జరపొద్దు’ అంటూ చంద్రసింగ్ గఢ్వాలీ అరిచాడు. తుపాకులు పేలలేదు. 72 మంది గఢ్వాలీ సైనికులు తుపాకులను కిందపడేశారు. మరో సైనిక పటాలం రప్పించి, తూటాల వర్షం కురిపించాడు. వందలాది మంది ఈ మారణహోమంలో మరణించారు. స్వాతంత్య్రోద్యమంలో ఘోరమైన మారణకాండల్లో ఇది ఒకటి.
మమ్మల్ని కాల్చండి
ఆ మారణహోమం జరిగిన తర్వాత రోజే కోర్టు మార్షల్ నిర్వహించారు. ‘నిరాయుధులైన మా సోదరులను కాల్చి చంపలేము. కావాలంటే తుపాకులతో మమ్మల్ని కాల్చవచ్చు’ అని గఢ్వాలీ సైనికులు చెప్పారు. కోర్ట్ మార్షల్ చంద్రసింగ్ గఢ్వాలీకి మరణశిక్ష, మిగతా సైనికులకు జైలు శిక్ష విధించింది. దేశమంతా ఆగ్రహం వ్యక్తమయ్యాక చంద్రసింగ్ గఢ్వాలీ మరణ శిక్షణను రద్దు చేసి, కారాగార శిక్ష విధించారు. 11 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత ఆయన విడుదలయ్యారు.
ప్రజల రక్షకుడికి నీరాజనం
చంద్రసింగ్ గఢ్వాల్ జైలు నుంచి విడుదలయ్యాక స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన స్ఫూర్తితో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించాడు. 1 అక్టోబర్ 1979లో చంద్రసింగ్ మరణించారు. డెహ్రాడూన్‌లోని ఆయన సమాధిని ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సందర్శించారు. ‘ప్రజల రక్షకుడు’ అని కీర్తించాడు.
తొలి ధిక్కార స్వరం!
బ్రిటిష్ ఇండియాలో జరిగిన స్వదేశీ ఉద్యమ ప్రేరణతో హైదరాబాద్ సంస్థానంలో ‘స్వదేశీ లీగ్’ ఏర్పడింది. నిజాం రాజ్యంలో ఖాదీ ప్రచారోద్యమం ప్రారంభించారు. విదేశీవస్తు బహిష్కరణ, ఖాదీలాంటి స్వదేశీవస్తు ప్రచారం స్వదేశీ లీగ్ లక్ష్యాలు. ఈ లీగ్‌కు సరోజినీ నాయుడు కూతురు పద్మజానాయుడు అధ్యక్షురాలిగా, సిటీ కాలేజిలో అర్థశాస్త్ర అధ్యాపకుడు ఫజలుర్ రెహమాన్ కార్యదర్శిగా పనిచేశారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు రెహమాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. లీగు ఏడాది మాత్రమే పని చేసింది.ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరిస్తూ హైదరాబాద్‌లో ‘మోతీలాల్ స్మారక దినం’ నిర్వహించారు. ప్రతి వారం కాంగ్రెస్ పతాక వందనోత్సవం నిర్వహించారు. 144వ సెక్షన్ ప్రయోగించినా నవజవాన్ సభ ఆధ్వర్యంలో మోతీలాల్ స్మారక దినం జరిపారు. ఈ సంస్థలు, సమావేశాలు ప్రజల్లో నూతన రాజకీయ భావాల వికాసానికి దోహదం చేశాయి. యువతను రాజకీయ ఉద్యమాల్లో భాగం చేశాయి.