హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) మార్గదర్శకాలు విడుదలయ్యాయి. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మార్గదర్శకాలను విడుదల చేశారు. ఒకసారి(ఎపిసోడ్) చికిత్సకు రూ. 3 లక్షల పరిమితి విధించారు. అయితే మూడు లక్షలు దాటినా క్యాష్‌లెస్ వైద్యం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం 2026 జూలై 17 నుంచి అమల్లోకి వచ్చినట్టు మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. ఈ స్కీమ్ అమలుకు ఉద్యోగి మూల వేతనం నుంచి 1.5 శాతం కోత పెట్టనుండగా, ప్రభుత్వం అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్‌గా సమకూరుస్తుంది. ఈ మొత్తం ఈహెచ్సీటీ ట్రస్టులో జమ అవుతుంది. ఈ మొత్తం నుంచి చికిత్సలకు బిల్లులు చెల్లిస్తారు. అయితే పథకం అమలులో కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారుల నుంచి ప్యాకేజీలో పేర్కొన్న సేవలకు అదనపు డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలుంటాయి. అక్రమాలు లేదా మోసాలకు పాల్పడే ఎంపానెల్ దవాఖానలపై జరిమానా, సస్పెన్షన్, డీ-ఎంప్యానెల్మెంట్, బ్లాక్ లిస్టింగ్ వంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. లబ్ధిదారులు పథకాన్ని దుర్వినియోగం చేసినట్టు తేలితే, సంబంధిత మొత్తాన్ని రికవరీ చేయడంతో పాటు శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. హెల్త్‌కార్డులు, అర్హత, చికిత్స నిరాకరణ, డబ్బు వసూలు, గది కేటాయింపు, మందులు, పరీక్షలు, ప్రీ-ఆథరైజేషన్, హాస్పిటల్ సేవలు, వైద్య నాణ్యత తదితర అంశాలపై లబ్ధిదారులు ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర, జిల్లా, వెల్నెస్ సెంటర్, నెట్వర్ దవాఖాన స్థాయిల్లో గ్రీవెన్స్ రీఅడ్రెస్సల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
రాష్ట్రంలోని రెగ్యులర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రొవిన్షియలైజ్డ్ ఉద్యోగులు ఈ పథకంలోకి వస్తారు. రిటైర్డ్ ఉద్యోగుల్లో సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు, రీ -ఎంప్లాయిడ్ సర్వీస్ పెన్షనర్లు ఈ పథకానికి అర్హులు. పోలీస్‌శాఖకు చెందిన ఆరోగ్య భద్రత, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖకు చెందిన ఆరోగ్య సహాయత పథకాల లబ్ధిదారులను కూడా నిర్ణీత విధానాల ప్రకారం ఈ స్కీమ్‌లో చేర్చుతారు. అర్హత కలిగి ఉద్యోగిపై ఆధారపడ్డ కుటుంబసభ్యులకు కూడా పథకం వర్తిస్తుంది. లబ్ధిదారుల వివరాలను ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్సిస్టంలో నమోదు ఆధారంగా గుర్తిస్తారు. ఉద్యోగులు వారి వివరాలను సంబంధిత డీడీవోలు, పెన్షనర్లు పీపీవో, ఎస్టీవో ద్వారా ధృవీకరించుకోవచ్చు. లబ్ధిదారులకు డిజిటల్ క్యూఆర్ కోడ్ గల హెల్త్‌కార్డులను జారీ చేస్తారు. మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ద్వారా కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కార్డులు అందేవరకు ఉచిత వైద్యం అందుతుంది. ఉద్యోగి లేదా పెన్షనర్ గుర్తింపు నంబర్ ఆధారంగా చికిత్స కొనసాగుతుంది. కార్డు లేదనే కారణంతో చికిత్స నిరాకరించకూడదు.
రాష్ట్రంలోని వెల్నెస్ సెంటర్ల ద్వారా నగదు రహిత ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు, ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. మందులు కూడా అందిస్తారు. సాధారణ వ్యాధులతోపాటు కంటి, దంత, ఈఎన్టీ, పీడియాట్రిక్, ఫిజియోథెరపీతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, క్షయ, ఆర్థరైటిస్, ఆటోఇమ్యూన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా సేవలు అందుబాటులో ఉంటాయి. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, లివర్ ఫంక్షన్, లిపిడ్ ప్రొఫైల్, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ, మామోగ్రఫీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ వంటి పరీక్షలను వెల్నెస్ సెంటర్లలో నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వెల్నెస్ సెంటర్లు ఉండగా అదనంగా 25 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.