హైదరాబాద్ : రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇక ఆయా నియోజకవర్గాల్లో సంబంధిత జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ పతాకాలను చేతబూని కొనసాగిన ఈ ర్యాలీలు కన్నుల పండగగా జరిగాయి. అనంతరం ఆయా నియోజక కేంద్రాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించి భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం కలయికకు దారితీసిన పరిస్థితులు, అనంతర కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సంబంధిత ప్రజాప్రతినిధులు వివరించారు. అనంతరం, అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సామూహిక భోజనాలలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్ ఐమాక్స్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన సమైక్యతా ర్యాలీలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు, విద్యార్థినివిద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ ర్యాలీ అనంతరం పీపుల్స్ ప్లాజాలో జరిగిన బహిరంగ సభలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ 17నే వచ్చిందని అందుకోసమే దీనిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవమైన గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించు కున్నామని, ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ సచివాలయానికి భారత రత్న బీఆర్ అంబేద్కర్ పేరుపెట్టడం ద్వారా సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు.
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 చాలా ముఖ్యమైన రోజు. అంతకు ముందు నిజాం ప్రభుత్వం ఉండేది. మిగతా ప్రాంతాల్లోగా మనకు అంత సులభంగా స్వాతంత్య్రం రాలేదు. పెద్ద ఉద్యమం.. చాలామంది ప్రాణాలు కోల్పోయాక మనకు స్వాతంత్య్రం వచ్చింది. నిజాం రాజు.. భారత దేశంలో హైదరాబాద్ విలీనం కావాలని నెహ్రూకు లేఖ రాశారు. ఖాసీం రజ్వీ లాంటి వాళ్ళు వ్యతిరేకించినా ఆయనను జైల్లో పెట్టి స్వాతంత్య్రం ఇచ్చారు. దేశానికి గాంధీ ఎలాగో.. తెలంగాణకు గాంధీ కేసీఆర్ అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 15 వేల మంది ర్యాలీలో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 17పై అందరికీ అవగాహన కలగాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా పురోగతి సాధిస్తోందని తెలిపారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో.. కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని అన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరైన వారితో కలసి సామూహిక భోజనాలు చేశారు.