హైదరాబాద్, సెప్టెంబర్6 (నమస్తే తెలంగాణ) : నూర్ బాషా-దూదేకుల సమాజాభివృద్ధ్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను తక్షణం ఏర్పాటు చేయాలని తెలంగాణ ముస్లిం బీసీ వెల్ఫేర్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వైస్ చైర్మన్ మహ్మద్ రాజమ్మద్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నూర్ బాషా-దూదేకుల సమాజం విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇప్పటికీ అనేక సమస్యలు ఎదురొంటున్నదని పేర్కొన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ అవసరమని తెలిపారు.
2010లో జారీ చేసిన జీవో 125కు అనుగుణంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక బడ్జెట్, స్వయం ఉపాధి, సబ్సిడీ రుణాలు, విద్యా సహాయం, నైపుణ్య శిక్షణ, యువతకు ఉపాధి కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో ఓబీసీ కాలం పొందుపర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న ధర్మ పోరాట దీక్షలను చేపట్టనున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కులగణనలో ఓబీసీ కాలం చేర్చాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యక్ష పోరాటాలకు కార్యాచరణకు దిగుతున్నామని తెలిపారు. అందులో భాగంగా 11న దీక్షలు, 20వ జాతీయ ఓబీసీ సదస్సును నిర్వహించనున్నామని వెల్లడించారు. తమ పోరాటానికి మద్దతు తెలియజేయాలని కోరారు.