గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:50:26

వడివడిగా ప్రగతివైపు

వడివడిగా ప్రగతివైపు
  • ముమ్మరంగా పట్టణ ప్రగతి కార్యాచరణ
  • మారుతున్న పట్టణాల రూపురేఖలు

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: పట్టణప్రగతి కార్యాచరణ అమలులో భాగంగా వార్డులు, డివిజన్లలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. అభివృద్ధి పనులతోపాటు పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపడుతుండటంతో ప ట్టణాల రూపురేఖలు మారిపోతున్నా యి. పట్టణ ప్రగతిలో తొమ్మిదో రోజై న మంగళవారం మంత్రులు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నా రు.


స్వచ్ఛతలో ఆదర్శం: హరీశ్‌రావు 


అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నదని, పట్టణాలు, పల్లెలు సైతం మొదటి స్థానంలో నిలువాలనే సదుద్దేశంతో.. ప్రభు త్వం పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు చేపట్టిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ప్రజలు తమ పట్టణాలను, గ్రామాలను స్వచ్ఛతలో ఆదర్శంగా నిలుపాలని కోరారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి పట్టణప్రగతి పనులను మంత్రి పర్యవేక్షించారు. స్మృతివనంలో మొక్కలు నాటడంతోపాటు రూ.50 లక్షలతో మహిళా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి నెలా పట్టణాలకు రూ.78 కోట్లు, పల్లెలకు రూ.339 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఇండ్లులేక అద్దెకుంటున్న వారికి రూపాయి ఖర్చులేకుండా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అందజేస్తామన్నారు. జాగ లేని పేదోళ్లకు డబుల్‌ బెడ్‌రూం, గుడిసె ఉన్న పేదోళ్లకు అక్కడే ఇల్లు కట్టుకునేందుకు సాయం అందించనున్నదని తెలిపారు. ఈవిషయంలో త్వరలోనే సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు.  

 

నిరంతరం కొనసాగాలి: పువ్వాడ

పట్టణ ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగాలని, పట్టణాల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌తో కలిసి మంత్రి పట్టణప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన వైరా మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. 4వ వార్డులో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కూల్చివేసి ఆ స్థలాన్ని అభివృద్ధి పనులకు వినియోగించాలని సూచించారు. వైరా రిజర్వాయర్‌ వద్ద రూ.5 కోట్లతో చేపడుతున్న మినీ ట్యాంక్‌బండ్‌ పనులను మంత్రి పరిశీలించారు. 


పట్టణాలను మార్చుకుందాం: మల్లారెడ్డి

‘మనం మారుదాం.. మన పట్టణాలను మార్చుకుందాం’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణప్రగతిలో భాగంగా మంగళవారం మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లిలో కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి సుమారు రూ.2.64 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థానపలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని పట్టణాలను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా మార్చుతున్నదన్నారు.


పట్టణాభివృద్ధికి కృషిచేయాలి: అల్లోల


పట్టణాల అభివృద్ధిలో అందరూ భాగస్వాము లు కావాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని బుధవార్‌పేట్‌, బంగల్‌పేట్‌ తదితర వార్డుల్లో మంగళవారం నిర్వహించిన పట్టణ ప్రగతిలో కలెక్టర్‌ ముషారఫ్‌అలీఫారూఖీతో కలిసి పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ము రుగు కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్‌లోని 42 వార్డుల్లో కౌన్సిలర్లు, ప్రజలు, అధికారులు గుర్తించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు.పరిశుభ్రతకే పట్టణప్రగతి 

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే పట్టణ ప్రగతి లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమా ర్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం వారు కరీంనగర్‌లోని 16వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీధులను, మురుగుకాల్వలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలన్నారు. చెట్లతోనే పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలుంటే అందులో పిల్లల కోసం పార్కులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వీరి వెంట ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ వై సునీల్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


అభివృద్ధికి ప్రాధాన్యం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 

పట్టణాలను పచ్చగా మార్చేందుకు ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్‌ నగరంలో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మేయర్‌ నీతూకిరణ్‌తో  కలిసి మంత్రి పర్యటించారు. మురుగుకాల్వలను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చూడాలని అధికారు లను ఆదేశించారు. విరివిగా మొక్కలు నా టేందుకు మంగళవారం ‘హరితహారం-డే’ గా నామకరణం చేసి అందరితో మొక్కలు నాటించడంపై కలెక్టర్‌ నారాయణరెడ్డిని మంత్రి అభినందించారు. 


logo